సీనియర్ నటుడు నాజర్ అంటే అవసరం లేని పేరు అనే చెప్పాలి. ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషిస్తూ సుమారు 37 ఏళ్లుగా ఆయన ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. చెప్పుకోవడానికి తమిళ నటుడే అయినప్పటికీ తెలుగులో కూడా ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి ఇక్కడ కూడా మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నారాయన. 1989 వ సంవత్సరంలో వచ్చిన ‘కోకిల’ ‘ముద్దుల మేనల్లుడు’ చిత్రాలతో టాలీవుడ్ కు పరిచయమైన ఆయన ఆ తర్వాత వచ్చిన ‘మాతృదేవోభవ’ ‘చంటి’ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ వంటి చిత్రాలతో బాగా ఫేమస్ అయ్యారు.
తెలుగులో ఈయన మొత్తంగా 150 కి పైగా సినిమాల్లో నటించారు. ‘దూకుడు’ చిత్రంతో కమెడియన్ గా కూడా చేయగలను అని రుజువు చేసి ఆ తరువాత కామెడీ పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు. అలాగే తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పుకోగలను అని నిరూపించారు. తెలుగు ఇండస్త్రీలో నాజర్ కు మెగాస్టార్ చిరంజీవి బెస్ట్ ఫ్రెండ్. కానీ ఆయనతో కలిసి ఈయన నటించిన సినిమాలు చాలా తక్కువ. ఎవరి రికమండేషన్ లేకుండా సొంతంగా నటుడిగా ఎదగాలి అని ఆయన అనుకున్నారు అలాగే ఎదిగారు.
ఇదిలా ఉండగా కొద్ది రోజులుగా నాజర్ సినిమాలకు దూరం కాబోతున్నారు అనే వార్త ఎక్కువగా వినిపిస్తుంది.దానికి కారణం లేకపోలేదు. ఈ మధ్య కాలంలో నాజర్ సినిమాలను తగ్గించారు. ఆచి తూచి పాత్రలను ఎంపిక చేసుకుంటున్నారు. ఇంకొన్ని రోజుల్లో ఆయన సినిమాలకు దూరమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయట. అందుకు ప్రధాన కారణం ఈయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడమే అని తెలుస్తుంది.
లాక్‌డౌన్ టైంలో నాజర్ గుండె సంబంధిత సమస్యలతో బాధపడ్డారట.అందుకే సినిమాలకు కాస్త విరామం ఇచ్చి ఆ పై పూర్తిగా ఆరోగ్యంపైనే ఆయన దృష్టి పెట్టాలనుకుంటున్నారు అని తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆయన ఒప్పుకున్న సినిమాలను మాత్రం పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయం పై నాజర్ నుండి లేదా ఆయన కుటుంబం నుండి ఏ రకమైన అధికారిక ప్రకటన రాలేదు.