టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు ఆదివారం (డిసెంబర్ 25) ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. చలపతిరావు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నటులు మరియు సహాయక ప్రతినాయక పాత్రలలో గత 5 దశాబ్దాలుగా అనేక చిత్రాలలో ఎన్నో తరాల ప్రముఖ తారలతో కలిసి పనిచేశారు.
ఆయన కుమారుడు రవిబాబు కూడా టాలీవుడ్ లో నటుడు, దర్శకుడు మరియు నిర్మాతగా రాణిస్తున్నారు. యమగోల, యుగపురుషుడు, డ్రైవర్ రాముడు, సరదా రాముడు, జస్టిస్ చౌదరి, బొబ్బిలి పులి వంటి ఎన్నో చిత్రాలలో చలపతిరావు విలన్ పాత్రలలో నటించారు.
అలాగే ‘స్టేట్ రౌడీ’, ‘దొంగ రాముడు’, ‘అల్లరి అల్లుడు’, ‘నిన్నే పెళ్లాడుత’, ‘అల్లరి’, ‘నువ్వే కావాలి’ వంటి సినిమాల్లో సహాయక పాత్రలు పోషించారు.
ఆయన మృతి తెలుగు చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నిన్ననే మరో సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ గారు తుది శ్వాస విడిచిన విషాద ఛాయలు ఇంకా మరచిపోకముందే ఈరోజు చలపతిరావు గారి గురించి ఇలాంటి వార్త వినడం అందరినీ ఎంతో బాధకు గురి చేసింది. చలపతిరావు మృతికి పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు.
చలపతిరావు గారికి భార్య ఇందుమతి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. చలపతిరావు గారి కూతురు అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఆయన అంత్యక్రియలు హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో రేపు నిర్వహించనున్నారు.