దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న సినిమా ‘సీతా రామం’ ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’..అనేది ఉపశీర్షిక. ‘అందాల రాక్షసి’, ‘పడి పడి లేచె మనసు’ చిత్రాలతో ప్రేమకథలను ఆవిష్కరించడంలో తనదైన శైలిని ఏర్పరచుకున్నహను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకుడు.
ఈ సినిమాను ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్టు ఇది వరకే ప్రకటించారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు.దుల్కర్ సల్మాన్ సరసన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న ‘సీతా రామం’లో రష్మికా మందన్న కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో తొలి పాట ‘హే సీతా… ఓ రామ’ను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు.ఆ పాటకు మంచి స్పందనే వచ్చింది.
ఇక ఈరోజు ఒక ప్రైవేట్ ఈవెంట్ లో ఈ సినిమా టీజర్ విడుదల చేయడం జరిగింది.ఆహ్లాదకరమైన దృశ్యాలతో పాటు చక్కని సంభాషణలతో మనసుకు హత్తుకునే ప్రేమకధ చూడబోతున్నాం అనే భావన కలుగుతుంది ఈ టీజర్ చూస్తుంటే. స్వతహాగా మంచి మ్యూజిక్ టేస్ట్ ఉన్న దర్శకుడు హను రాఘవపూడి ఈసారి కూడా మంచి సంగీతాన్ని రాబట్టినట్టు కనిపిస్తుంది టీజర్ లో విశాల్ చంద్రశేఖర్ అందించిన నేపథ్య సంగీతం చాలా బాగుంది.
వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ తో పాటు శ్రేయాస్ కృష్ణసినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.సుమంత్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తొలి త్రిభాషా చిత్రమిదని చెప్పవచ్చు.