లెజెండ్ శరవణన్ అనే పేరుతో పిలువబడే శరవణన్ అరుళ్ తన అధికారిక ట్విట్టర్ ఎకౌంట్ లో తన ది లెజెండ్ సినిమా ఎట్టకేలకు ఓటీటీ ప్లాట్ ఫారం లో విడుదల అవుతున్నట్లు ప్రకటించారు. కాగా ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్ స్టార్ సొంతం చేసుకుందని, రేపటి నుంచి స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుందని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.
నిజానికి తమిళనాట ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరైన శరవణన్ అరుళ్ సినిమా తీయబోతున్నట్లు ప్రకటించడం తమిళ ప్రేక్షకులతో పాటు ఇతర సినీ ప్రియులను సైతం ఆశ్చర్యపరిచింది. ‘ది లెజెండ్’ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి దర్శకులు జేడీ, జెర్రీ దర్శకత్వం వహించారు.
ఒక పల్లెటూరిలో ఎన్నో అద్భుతమైన మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించే ప్రతిభావంతుడైన శాస్త్రవేత్త చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. అయితే స్వార్థ ప్రయోజనాలున్న కొందరు వ్యక్తులు తమ స్వంత ప్రయోజనాల కోసం ఆయన ప్రణాళికల్లో జోక్యం చేసుకుంటారు. మరి ఆ ఆశావహ శాస్త్రవేత్త వారిని అడ్డుకుని తన ఆలోచనలను ఎలా అమలు చేస్తాడనేది మిగతా కథ.
గత ఏడాది జులైలో విడుదలైన ఈ చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల నుంచి ప్రతికూల సమీక్షలను అందుకుంది. శరవణన్ నటనకు కూడా పేలవమైన స్పందన వచ్చింది. ఐతే ఈ వయసులో తానే ఇంత భారీ బడ్జెట్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించడం సాహసమేనని కొందరు ప్రేక్షకులు అన్నారు.
ది లెజెండ్ చిత్రంలో గీతికా తివారీ, ఊర్వశి రౌతేలా, వివేక్, సుమన్ మరియు నాజర్ వంటి ప్రముఖ నటులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: హారిస్ జయరాజ్, ఛాయాగ్రహణం, ఎడిటింగ్: ఆర్.వేల్రాజ్, రూబెన్. లెజెండ్ చిత్రం ప్రేక్షకుల నుండి మంచి టాక్ రాని కారణంగా బాక్సాఫీస్ వద్ద బాగా ఆడలేకపోయింది.