దక్షిణాది సినీ పరిశ్రమలో దిగ్గజ నటులలో ఒకరైన శరత్ బాబు మూడు వారాల క్రితం బెంగళూరులోని ఆసుపత్రిలో చేరారు. 71 ఏళ్ల ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు పరిశ్రమ ప్రముఖులు, సహచరులు ప్రార్థించగా.. అవన్నీ సఫలం అయినట్లే కనిపిస్తోంది. ఈనెల 20న హైదరాబాద్ లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ)లో చేర్పించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. శరీరం మొత్తం విషతుల్యం (సెప్సిస్) కావడంతో ఆ ప్రభావం కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం ఇతర అవయవాలపై పడినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఇప్పుడు ఆయన్ని జనరల్ వార్డుకు తరలించారని హాస్పిటల్ వర్గాలు పేర్కొన్నాయి. శరత్ బాబు హాస్పిటల్‌లో మళ్లీ అనారోగ్య సమస్యతో చేరారని తెలిసిన అభిమానులు గాభరా పడినా.. తరువాత ఆయనకేం కాలేదని తెలిసి శాంతించారు. గత కొన్ని గంటలుగా ఆయన ఆరోగ్యంపై సానుకూల స్పందన వస్తుండటంతో ఆయన్ను జనరల్ వార్డ్ కి తరలించినట్లు సమాచారం. అయితే, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ప్రస్తుత పరిస్థితిని కొంత కాలం పరిశీలించాలని భావిస్తున్న ఆసుపత్రి యాజమాన్యం ఆయనను వెంటనే డిశ్చార్జ్ చేయడం పై మౌనం వహిస్తోంది.
శరత్ బాబు కొన్నేళ్లుగా సినిమాల్లో కనిపించక పోవడంతో లైమ్ లైట్ కు దూరమయ్యారు. ఆయన ఆరోగ్యం పై తదుపరి అప్డేట్ కోసం మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే కానీ ప్రస్తుతం మాత్రం ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తెలుస్తోంది.
శరత్ బాబు తన కాలంలో తమిళ, తెలుగు చిత్రసీమలో అగ్రనటులలో ఒకరు. చక్కని లుక్స్ కి మారుపేరైన ఈ నటుడు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు బిజీగా ఉన్నారు. అంతే కాకుండా దక్షిణ భారత చలనచిత్ర రంగంలోని కొంతమంది పెద్ద స్టార్లతో తెరను పంచుకున్నారు.
71 ఏళ్ల శరత్ బాబు.. అసలు సేరు సత్యం బాబు దీక్షితులు. తెలుగు, తమిళ చిత్రాలతో పాటు కొన్ని కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లోనూ నటించారు. కె.బాలచందర్ దర్శకత్వం వహించిన పట్టిన ప్రవేశం (1971) చిత్రంతో వెండితెర అరంగేట్రం చేశారు. ఆ తర్వాత నిజాల్ నిజామిరాదు, అన్నామలై, ప్రాణస్నేహితులు, సీతాకోకచిలుక, ముత్తు, బాబా, పుతియా గీతై వంటి చిత్రాల్లో నటించారు. రజినీకాంత్, చిరంజీవి వంటి సూపర్ స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆయన 90వ దశకంలో రజినీకాంత్ తో కలిసి నటించిన సినిమాలు బ్లాక్బస్టర్ అయ్యాయి.
ఆ తర్వాత బుల్లితెర సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన శరత్ బాబు అక్కడ కూడా మంచి ప్రేక్షకాదరణ పొంది తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డులు కూడా అందుకున్నారు.