ఈ ఏడాది సంక్రాంతికి తెలుగు నుంచి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, తమిళం నుంచి తునివు, వారిసు వంటి స్టార్ హీరోల చిత్రాలు విడుదలయ్యాయి. దక్షిణాదిన టాప్ స్టార్స్ నటించిన ఈ నాలుగు సినిమాల ద్వారా బాక్సాఫీస్ వద్ద చిరు వర్సెస్ బాలయ్య, అజిత్ వర్సెస్ విజయ్ పోటీలని చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు.
వారిసు, తునివు చిత్రాలు జనవరి 11న తమిళనాడుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాగా, వీరసింహారెడ్డి జనవరి 12న విడుదలై బాలయ్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. వాల్తేరు వీరయ్య జనవరి 13న విడుదలై అద్భుతమైన ఓపెనింగ్ వీకెండ్ ను రాబట్టి వీక్ డేస్ లో కూడా సక్సెస్ ఫుల్ రన్ ను కొనసాగించింది.
ఇక దక్షిణాదిలోని నాలుగు సినిమాలు ఓవర్సీస్ రన్ లో కూడా విజయవంతంగా దూసుకుపోయాయి. వాల్తేరు వీరయ్య 12.75 కోట్ల షేర్ తో 3.22 మిలియన్ డాలర్లు రాబట్టింది. వీరసింహారెడ్డి ఓవర్సీస్ లో రూ.5.2 కోట్ల షేర్ తో 1.59 మిలియన్ డాలర్ల మార్కును అందుకుంది.
తమిళ చిత్రాలు తునివు, వారిసు సినిమాలు కూడా ఓవర్సీస్ లో తమ తడాఖా చూపించాయి. ఇందులో తునివు 6.65 మిలియన్ డాలర్లు (రూ.23 కోట్ల షేర్), వారిసు 10.6 మిలియన్ డాలర్లు (రూ.37 కోట్లు) వసూలు చేశాయి.
కలెక్షన్ల పరంగా చూస్తే తెలుగులో వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి పై విజయం సాధించగా, ఈ సంక్రాంతి పోరులో వారిసు తునివును అధిగమించింది. అయితే పండగ సీజన్ లో నాలుగు పెద్ద స్టార్ సినిమాలను చూసి ఆనందించే అవకాశం రావడంతో సినీ ప్రియులే అసలైన విజేతలుగా నిలిచారు.