ఆదిపురుష్ చిత్రం టీజర్ విడుదల తర్వాత, మెగా ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధానికి రంగం సిద్ధం అయింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, అలాగే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాలు 2023 సంక్రాంతికి విడుదల తేదీని ప్రకటించిన సంగతి తెలిసిందే.
కాగా ఆది పురుష్ టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి ట్రోలింగ్‌కి గురైంది. దర్శకుడు ఓం రౌత్ విజన్, మరియు గ్రాఫిక్స్ వర్క్ ను రాబట్టుకున్న తీరు ఏమాత్రం బాగోలేదని పలు విమర్శకులు, సినీ ప్రేమికులు విరుచుకుపడ్డారు. ఇక ప్రభాస్ అభిమానులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇన్నేళ్లు ఆశగా ఎదురు చూస్తే ఇలాంటి పేలవమైన టీజర్ ఇచ్చాడని వారు సోషల్ మీడియాలో ఓం రౌత్‌పై దాడి చేశారు.
ఇక రాబోయే సంక్రాంతి క్లాష్ విషయానికి వస్తే, రెండు వైపుల నుండి ట్రోల్స్ చేయడంలో ఎవరూ తగ్గటం లేదు. నిజానికి ఆదిపురుష్ యొక్క టీజర్లో నాణ్యత తగ్గినప్పటికీ, బాక్స్ ఆఫీస్ వద్ద ఆ చిత్రం విజయవంతం అయ్యే అవకాశాలే ఎక్కువ. అందుకే ఈ రెండు సినిమాల పోటీ తెలుగు మార్కెట్ వరకూ ఖచ్చితంగా అతి పెద్ద క్లాష్‌లలో ఒకటని చెప్పచ్చు. ఈ రెండు చిత్ర యూనిట్లు కూడా తమ సినిమాల విజయం పై నమ్మకంతో ఉన్నారు. ఇక తమ అభిమాన హీరో నటించిన చిత్రం అవతలి హీరో చిత్రాన్ని చిత్తుగా ఒడిస్తుందని ఇరు వర్గాల అభిమానులు గట్టిగా చెబుతున్నారు.
ఆదిపురుష్‌లో ప్రభాస్ తో పాటు కృతి సనన్ మరియు సైఫ్ అలీ ఖాన్ నటించగా, బాబీ దర్శకత్వంలో వస్తున్న వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్ చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా, మాస్ మహరాజ్ రవితేజ ఒక ముఖ్య అతిధి పాత్రలో నటిస్తున్నారు.
కాగా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సీజన్ లో భీమ్లా నాయక్, RRR మరియు రాధే శ్యామ్ సినిమాలు పోటీ పడాల్సి ఉండింది. అయితే కరోనా వల్ల అన్నీ వాయిదా పడడంతో మంచి సీజన్లో రసవత్తరమైన పోటీని చూసే అవకాశం ప్రేక్షకులు మిస్ అయ్యారు. ఇప్పుడు ఆదిపురుష్ మరియు వాల్తేరు వీరయ్య పోటీతో, 2022 సంక్రాంతికి ఉండాల్సిన భారీ పోటీ మరియు అభిమానుల మధ్య ఉత్సాహాన్ని 2023 సంక్రాంతి పండగ సీజన్ కు మనం తిరిగి చూడబోతున్నాం.