గత కొంత కాలంగా.. నటి సమంత పలు యూట్యూబ్ ఛానెల్స్ మరియు సోషల్ మీడియా ట్రోల్ అకౌంట్లకు టార్గెట్ గా ఉంది. అయితే, ఇంతవరకూ ఓపిక పట్టిన సమంత, ఈ విషయాలన్నింటినీ సీరియస్ గా తీసుకోవాలి అనుకుంటున్నారట. ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోని సమంత, సాధారణంగా తన పనిలో నిమగ్నమై వాటి విజయాల ద్వారానే తన స్పందనను తెలియజేసేవారు. అయితే, ఇప్పుడు మాత్రం తనపై ఎడతెరిపి లేకుండా నిరాధారమైన పుకార్లను వ్యాప్తి చేసినందుకు కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లపై చర్య తీసుకోవాలని నిర్ణయించుకున్నారట.
కాగా, సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు, హీరోయిన్ల వ్యక్తిగత జీవితం మరియు వృత్తి పరమైన విషయాల పై సోషల్ మీడియాలో పుకార్లు రావడం సహజమే. కానీ గత కొన్ని రోజులుగా అనేక యూట్యూబ్ ఛానెల్‌లు సమంత గూర్చి చాలా తప్పుడు వార్తలు ప్రచారం చేశాయి. ఇటీవలే సమంత కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు పేర్కొనడం ప్రారంభించాయి. అంతే కాకుండా కొంతకాలంగా సమంత అందుకు చికిత్స కూడా తీసుకుంటున్నారు అని వార్తలు ప్రచారం చేశాయి. ఈ పుకార్లతో విసిగిపోయిన సమంత ఇప్పుడు వాటికి సరైన గుణపాఠం ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. త్వరలోనే ఈ ఛానెల్‌లపై సైబర్ క్రైమ్ కేసు నమోదు చేయాలనే ఆలోచనలో సమంత ఉన్నట్లు సమాచారం.
గత ఏడాది అక్టోబర్‌లో కూడా కొన్ని యూట్యూబ్ ఛానెళ్ల పై ఇలాంటి చర్యలే తీసుకున్నారు సమంత. నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న తర్వాత, సమంత గురించి ప్రైవేట్ యూట్యూబ్ ఛానెల్‌ల నుండి అనేక ట్రోల్స్ తో పాటు నిరాధారమైన ఫేక్ వీడియోలను ప్రచారం చేశాయి.
అయితే అప్పట్లో మూడు యూట్యూబ్ ఛానెల్స్ మరియు విశ్లేషకుడు CL వెంకటరావుపై పరువు నష్టం కేసు పెట్టారు సమంత. ఆ విషయం పై కూకట్‌పల్లి కోర్టులో కేసు నమోదు చేసి విచారణ కూడా జరిగింది. ఏదేమైనా సినిమా నటులైనంత మాత్రాన ఇలా ఇష్టమొచ్చినట్టు వ్యక్తిగత జీవితం గురించి పుకార్లు రేపడం ఎంతమాత్రం సరికాదు. కోర్టు కేసులు లేదా అధికారిక చర్యలు కన్నా ఇలాంటి వార్తలు ప్రచారం చేసేటప్పుడు ఆయా యూట్యూబ్ లేదా సోషల్ మీడియా పేజీలు తమను తాము ఒకసారి ప్రశ్నించుకావాలి.