ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత కొద్ది నెలల క్రితమే భర్త నాగ చైతన్యతో విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వ్యక్తిగత జీవితంలోని బాధ నుండి బయటపడి కెరీర్ లో ముందుకు వెళ్ళే క్రమంలో సమంత అనూహ్యంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డారు. మయోసైటీస్ సమంతను శారీరకంగా ఎంతో బలహీనపరిచింది. ఈ క్రమంలోనే షూటింగుల నుంచి కొంతకాలం విరామం ఇచ్చిన సమంత.. కొద్ది రోజులు చికిత్సకు సమయం కేటాయించారు.
ఆ పైన మయోసైటిస్ నుంచి కాస్త కోలుకుని మళ్లీ కెమెరా ముందుకు వచ్చిన సమంత.. విజయ్ దేవరకొండ `ఖుషి`(Kushi) తో పాటు బాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ షూటింగ్ లో పాల్గొన్నారు. ఇక సమంత అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నారని అందరూ అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా వెంటిలేటర్ పై ఆక్సిజన్ మాస్క్ వేసుకున్న ఫోటోని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో సమంత షేర్ చెయ్యడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
ముఖ్యంగా అభిమానులు ఒక్కసారిగా ఆందోళనలో పడిపోయారు. సమంత ఆరోగ్యం మళ్లీ క్షీణించిందా అంటూ వారు ఆందోళన చెందారు. కానీ, అసలు విషయాన్ని సమంత వెల్లడించారు. తాను హైపర్‌బేరిక్ థెరపీ తీసుకుంటున్నట్లుగా సమంత తెలిపారు. ఈ థెరపీ మయోసైటిస్ బారిన పడిన వారికి ఎంతో అవసరమని సమంత అన్నారు. నిజానికి హైపర్‌బేరిక్ థెరపీ అనేది ఆటో ఇమ్యూన్ వ్యాధులకు శక్తిమంతమైన సాధనంగా ఉపయోగపడుతుంది.
న్యూరో డీజెనరేటివ్ అనే వ్యాధిని తగ్గించేందుకు ఈ థెరపీ సహాయపడుతుంది. దీని వల్ల ఆటిజం, ఇన్‌ఫ్లామేషన్, ఇన్‌ఫెక్షన్లను తగ్గుతాయి. అంతే కాకుండా ఈ థెరపీ శరీరంలో దెబ్బతిన్న కణాలను తిరిగి సాధారణ స్థితిలోకి తీసుకొస్తుందని సమంత తన పోస్ట్ లో పేర్కొన్నారు దీంతో సమంత ఆరోగ్యం విషయంలో భయపడాల్సిన అవసరం లేదని తెలుసుకున్న అభిమానులు కాస్త ఊరట చెందుతున్నారు.
కాగా, సమంత ఇటీవలే శాకుంతలం సినిమాతో ప్రేక్షకులను పకలరించిన సంగతి తెలిసిందే. గుణశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. ఏదైతేనేం.. సమంత థెరపీ నుంచి తొందరగా కోలుకుని మళ్ళీ పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుందాం.