సాయి పల్లవి నటించిన గార్గి సినిమా ఈ వారం ఓటిటి లో విడుదలైన సంగతి తెలిసిందే. సోనీ లివ్ యాప్ లో ఈ చిత్రం ఈ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఓటిటిలో విడుదలైనప్పటి నుండీ గార్గి చిత్రం అన్ని వర్గాల నుండి ప్రశంసలు అందుకుంటుంది. కాగా ఈ సినిమా జూలై 15న థియేటర్లలో విడుదలై చక్కని స్పందనను తెచ్చుకుంది. విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ గా కూడా ఈ చిత్రం హిట్ అయింది. ఇక ఎప్పటిలానే నటిగా సాయి పల్లవికి గొప్పగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
గార్గి సినిమా తమిళం, తెలుగు మరియు కన్నడ భాషలలో విడుదలైన బహుభాషా చిత్రం. కోర్టు రూం డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో విశేషం ఏమిటంటే అన్ని వెర్షన్లలోనూ సాయి పల్లవి తన పాత్రకి తానే స్వంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. ఇక ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకులు ఫిదా అయిపోయారు. అంతే కాకుండా ఖచ్చితంగా ఇది ఆమె కెరీర్ లోనే ఉత్తమ నటనగా పేర్కొన్నారు.
గౌతం రామచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమిళ నటుడు కాళీ వెంకట్ ఒక కీలక పాత్రలో నటించారు. సాయి పల్లవి గార్గి సినిమాని బ్లాక్కీ, జెనీ & మై లెఫ్ట్ ఫుట్ ప్రొడక్షన్స్ నిర్మించాయి. స్టార్ హీరో సూర్య ఈ చిత్రాన్ని తమిళంలో సమర్పించారు. ఇక ఈ సినిమాని చూసి మెచ్చిన ప్రేక్షకులు మరియు పలు విమర్శకులు ఈ చిత్రానికి జాతీయ అవార్డు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
ఇక సాయి పల్లవి తన తదుపరి చిత్రంలో తమిళ హీరో శివ కార్తికేయన్‌తో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రం కమల్ హాసన్ ప్రొడక్షన్స్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాని గత సంవత్సరం అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం స్టార్ హీరోగా శివ కార్తీకేయన్ ఎదుగుతున్నారు. కావున ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజ్‌కుమార్ పెరియసామి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. ఇక ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.