ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘ఫిదా’తో తెలుగు సినీ పరిశ్రమ లోకి అడుగు పెట్టిన సాయి పల్లవి. తొలి ప్రయత్నంలోనే తెలుగు ప్రేక్షకులకు చేరువై ఊహించని రీతిలో క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసిన సాయి పల్లవి.. అందం.. అభినయం, అంతకు మించి పని పట్ల ఉన్న అంకిత భావంతో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.
ఇక ఇటీవల విడుదలైన ‘లవ్ స్టోరీ’ ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాలు హిట్ అవ్వడమే కాక సాయి పల్లవికి ఎంతగానో పేరు తెచ్చి పెట్టాయి. తాజాగా విడుదలైన విరాట పర్వం బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరిచినా ఆ సినిమాలో కూడా సాయి పల్లవి నటనకు అద్భుతంగా ఉందని పేరు వచ్చింది.
ఇదిలా ఉండగా సాయి పల్లవి హిట్ అయిన చిత్రాలు చూస్తే ఒక విషయం అర్థం అవుతుంది. అదేంటంటే హుషారుగా, యువతకు నచ్చేలా పాత్ర చిత్రణ ఉంటూ అక్కడక్కడా కాస్త బలమైన సంభాషణలు ఉండే పాత్రల్లో సాయి పల్లవిని ప్రేక్షకులు చూడటానికి ఇష్టపడుతున్నారు.
అయితే తనకి ఉన్న స్టార్ ఇమేజ్ వల్ల కావచ్చు, లేదా స్వతహాగా సీరియస్ పాత్రల పై ఇష్టం కావచ్చు ఆ తరహా చిత్రాల్లో సాయి పల్లవి పని చేస్తున్నారు. గతంలో ఆమె నటించిన కణం, ఇటీవల విడుదలైన విరాట పర్వం సినిమాల్లో సాయి పల్లవి పాత్రలో హుషారు తక్కువ, గాఢత ఎక్కువ. అయితే అలాంటి పాత్రల్లో సాయి పల్లవిని చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడటం లేదు అని ఆయా చిత్రాల ఫలితాలే నిదర్శనం.
ప్రస్తుతం సాయి పల్లవి మరోసారి అలాంటి సీరియస్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆ. సినిమా పేరే గార్గి. గార్గి చిత్రాన్ని బ్లాకీ జనీ & మై ఫుట్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రవి చంద్రన్ రామచంద్రన్ – ఐశ్వర్య లక్ష్మీ – థామస్ జార్జ్ – గౌతమ్ రామచంద్రన్ (దర్శకుడు కూడా) సంయుక్తంగా నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై రానా దగ్గుబాటి ఈ సినిమాని తెలుగులో సమర్పిస్తున్నారు. తమిళంలో సూర్య,జ్యోతిక సమర్పిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో జూలై 15న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. మరి ఈ సినిమాతో అయినా సాయి పల్లవి ఇష్టపడే సీరియస్ పాత్రలో అటు నటనకు ప్రశంసలతో పాటు ఇటు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా విజయం సాధించాలని కోరుకుందాం.