ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ సాయి పల్లవి తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఆ తరువాత వరుస సినిమాలతో అతి తక్కువ సమయంలో చక్కని క్రేజ్ ను,ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తను కేరళ నేపథ్యంలో నుండి వచ్చింది అని మొదటి నుండి ప్రచారం జరిగినా, ఆ విషయంలో నిజం లేదని, తను తమిళ నాట పుట్టాను అని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్వయంగా సాయి పల్లవి చెప్పడం జరిగింది.
అయితే ముందుగా చెప్పుకున్నట్టు సాయి పల్లవికి ఒక సాధారణ హీరోయిన్ కంటే ఖచ్చితంగా క్రేజ్ ఎక్కువ ఉంది. ఇందుకు పడి పడి లేచే మనసు, శ్యామ్ సింఘా రాయ్, విరాట పర్వం చిత్రాల వేడుకలలో ఆమె పేరు చెప్పినా లేదా ఆమె మాట్లాడటానికి వచ్చినపుడు ప్రేక్షకుల నుంచి లభించిన స్పందన,హర్ష ధ్వానాలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
అయితే ఈ స్పందన కేవలం ఫంక్షన్ ల వరకే పరిమితం అని, సినిమా కలెక్షన్లకి సాయి పల్లవి పెద్దగా ఉపయోగ పడట్లేదు అని ట్రేడ్ వర్గాల వాదన విన్పిస్తోంది. దగ్గుబాటి రానా తో కలిసి సాయి పల్లవి నటించిన విరాట పర్వం చిత్రం ఈ వారం విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రంఘోరమైన ఓపెనింగ్ ను రాబట్టడం ట్రేడ్ వర్గాలను షాక్ కి గురి చేసింది.తొలి రోజు షేర్ కనీసం కోటి రూపాయలను దాటకపోవడం విడ్డూరం అనే చెప్పాలి.
అయితే తర్కించి చూస్తే విరాట పర్వం అయినా, మరే ఇతర లేడీ ఓరియంటెడ్ సినిమాల పరాజయాలను హీరోయిన్స్ కు ఆపాదించడం ఏమాత్రం సరికాదు. సినిమాలో సరైన కథ,పాత్ర ఉంటేనే యే హీరోయిన్ అయినా ఆ సినిమాకు ఉపయోగపడుతుంది కానీ కేవలం తన పేరు మీదే సినిమా థియేటర్ల వద్దకు ప్రేక్షకులను రప్పించడం సాయి పల్లవి యే కాదు యే హీరోయిన్ వల్లా అవదు. ప్రస్తుతం మార్కెట్ లో హీరోలకే బాక్స్ ఆఫీస్ వద్ద సరైన విధంగా ఫలితాలు రావట్లేదు. అలాంటపుడు హీరోయిన్ మీద నింద మోపడం తప్పు అనే చెప్పాలి.