సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మొదటి మూడు రోజుల తర్వాత సాధారణ రోజుల్లో కూడా బాక్సాఫీసు వద్ద చక్కని నిలకడ చూపించిన ఈ సినిమా మొదటి వారంలో ప్రపంచ వ్యాప్తంగా 31 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల షేర్ 25 కోట్లకు చేరువలో ఉండగా మిగిలిన ఏరియాల షేర్ 6 కోట్లకు పైగా ఉంటుంది.
ఈ కలెక్షన్లు రికార్డ్ బ్రేకింగ్ రేంజ్ లో ఉన్నాయి మరియు భారీ తేడాతో సాయి ధరమ్ తేజ్ కు కెరీర్ లోనే హయ్యస్ట్ ఫస్ట్ వీక్ నంబర్స్ గా నిలిచాయి, ప్రతిరోజూ పండగే [33 కోట్లు] తరువాత ఆయన కెరీర్ లో 30 కోట్ల షేర్ ను క్రాస్ చేసిన రెండవ సినిమా ఇది, ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే విరూపాక్ష ఫుల్ రన్ లో 40 కోట్ల షేర్ ను చాలా సునాయాసంగా వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాల వారు భావిస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం పై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు పలు భాషల్లో విడుదల చేయాలని నిర్మాతలు భావించినప్పటికీ చివరి నిమిషంలో ఆ నిర్ణయాన్ని మార్చుకుని తెలుగులో వచ్చిన స్పందనను చూసి వారం రోజుల తర్వాత ఇతర భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించారు. ఇక విరూపాక్ష తెలుగులో బ్లాక్ బస్టర్ కావడంతో ఇప్పుడు హిందీ వెర్షన్ ను మే 5న విడుదల చేయనున్నారు.
బి.అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి షామ్దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ విభాగంలో పని చేశారు సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ హీరో హీరోయిన్లుగా నటించగా.. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, అజయ్, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషించారు. రుద్రవనం అనే గ్రామంలో జరిగే అపరిష్కృత అంశాల ఆధారంగా రూపొందించబడిన ఈ సినిమాకి సుకుమార్ స్క్రీన్ ప్లే సమకూర్చారు.