రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కింది RRR సినిమా. ఇక ప్రపంచమంతా ఈ సినిమాని, దర్శకుడు రాజమౌళిని మెచ్చుకుంటూనే ఉంది. కేవలం భారతదేశం లోనే కాకుండా పాశ్చాత్యాల్లో కూడా RRR సినిమా భారీ విజయం సాధించింది. తాజాగా జపాన్ లో 114 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుని తన ఖాతాలో మరో రికార్డు జమ చేసుకుంది.
RRR సినిమా ఇప్పటికే దాదాపు 1200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది. హాలీవుడ్ ప్రేక్షకుల నుంచి ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు అయిన జేమ్స్ కామెరూన్ కూడా రాజమౌళి ప్రతిభకి పడిపోయి ఎంతగానో అభినందించారు. ప్రస్తుతం ఈ చిత్రం జపాన్ థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి హృదయపూర్వక సందేశాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ లో పంచుకున్నారు.
ఆ రోజుల్లో ఒక సినిమా 100 రోజులు, 175 రోజులు ఆడడం పెద్ద విషయం అని ఆయన ట్వీట్ చేశారు. కాలక్రమేణా వ్యాపార స్వరూపం మారిపోయింది… ఆ మధుర జ్ఞాపకాలు పోయాయి… కానీ జపాన్ అభిమానులు మాత్రం ఆ ఆనందాన్ని తిరిగి పొందేలా చేస్తున్నారు. లవ్ యూ జపాన్ అని ఆయన తన సంతోషం వ్యక్తం చేశారు.
‘ఆర్ఆర్ఆర్’ జపాన్లో 5.2 మిలియన్ డాలర్లు వసూలు చేసి 43 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఆర్ ఆర్ ఆర్ ఎప్పటికప్పుడు రికార్డులు బద్దలు కొడుతూ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా పలు అంతర్జాతీయ అవార్డులని వివిధ విభాగాల్లో గెలుచుకుంది. ఇటీవలే RRR సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్ దక్కించుకొని చరిత్ర సృష్టించింది.