భారత దేశం గర్వించదగ్గ దిగ్గజ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’ (Rocketry: The Nambi Effect). ఈ చిత్రంలో నంబి నారాయణన్ పాత్రలో హీరో మాధవన్ నటించడమే కాక ఆయనే స్వయంగా దర్శకత్వం వహించడం విశేషం. జులై 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అటు అద్భుతమైన ప్రశంసలతో పాటు బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని కూడా అందుకుంది.
నంబి నారాయణన్ భార్య పాత్రలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, నటి సిమ్రాన్ నటించారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హిందీ వెర్షన్ లో, అలాగే తమిళ స్టార్ హీరో సూర్య , తమిళ మరియు తెలుగు డబ్ వెర్షన్ లో అతిథి పాత్రలో నటించి మెప్పించారు. ఇదిలా ఉంటే ఇటీవల థియేటర్ల రిలీజ్ కే కాదు ఓటీటీలో కూడా సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయి అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూడటం ఒక ట్రెండ్ గా మారింది.
తాజాగా అలాంటి ప్రేక్షకులను అలరించే శుభవార్త రానే వచ్చింది. ఈ సినిమా ఓటీటీ అప్‌డేట్ వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ నెల 26 నుంచి రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్ సినిమా స్ట్రీమింగ్ అవుతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, థియేటర్ల వద్ద కలెక్షన్లను బాగానే రాబట్టుకుంది. హిందీ వెర్షన్ ఊహించని విధంగా డీసెంట్ సక్సెస్ అయిందని ట్రేడ్ వర్గాల సమాచారం.
ఇక సినిమా విషయానికి వస్తే, ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణన్ జీవిత కథను అద్భుతంగా ఆవిష్కరించారు మాధవన్. ఆయన నటనకు జాతీయ స్థాయిలో ఎన్నో ప్రశంసలు వచ్చాయి.. అలాగే సైంటిస్టులు, రాకెట్లు అంటూ టెక్నికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాలో అందుకు తగ్గట్టే సాంకేతిక విభాగాలు అద్భుతంగా పని చేశాయని చెప్పుకోవచ్చు. ఇస్రోలో రాకెట్స్ ఎలా పని చేస్తాయనే దృశ్యాలు వంటివి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
అబ్దుల్ కలామ్ తో నంబి నారాయణన్ స్నేహం వంటివి ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఒక దేశద్రోహి అనే ముద్ర పడిన వ్యక్తి ఎలా తన నిజాయితీని నిరూపించుకున్నాడు అనే కథను తెలుసుకోవలంటే, ఈ నెల 26 నుంచి ఓటీటీలో (Amazon Prime) లో విడులవుతున్న రాకెట్రీ ద నంబి ఎఫెక్ట్ ను చూసి తెలుసుకోవచ్చు.