ఆంధ్రప్రదేశ్ లో ముగిసిపోయింది అనుకున్న టికెట్ రేట్ల సమస్య తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన కొత్త జీవో వల్ల మళ్ళీ మొదటికి వచ్చింది.ప్రభుత్వం జారీ చేసిన జీవోకి కట్టుబడి థియేటర్ యాజమాన్యాలు ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకోవాలని కలెక్టర్ల ద్వారా ఒత్తిడి తీసుకు వస్తూ ఉండడంతో అందుకు వారు ఒప్పుకోవడం లేదు.
ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లకు సంభందించిన మార్గదర్శకాలను ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బుక్ మై షో, పే వంటి ఆన్లైన్ టికెట్ పోర్టల్ ల ద్వారా టికెట్ అమ్మకాలను నడుపుతున్న ఆంధ్రప్రదేశ్ లోని థియేటర్లు ఇక మీదట నుంచి నోడల్ ఏజెన్సీ నిర్వహించే గేట్ వే ద్వారానే టికెట్లను 2% సర్వీస్ చార్జీలతో తమ వ్యాపారాన్ని నడిపించాలి. ఇక ఈ ఉత్తర్వుల ప్రకారం అన్ని థియేటర్ లు నడుచుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఆ దశలోనే ఈ ఒప్పందానికి థియేటర్ల యాజమాన్యాల సమ్మతి కోసం రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. ఎట్టి పరిస్థితుల్లో తమ అంగీకారం తెలపాల్సిందేనని లేని పక్షంలో థియేటర్లు సీజ్ చేస్తామని హెచ్చరించినట్టు సమాచారం. సత్తెనపల్లి,నరసరావుపేట,పిడుగురాళ్ల,వినుకొండ, చిలకలూరిపేటలో థియేటర్ల యాజమాన్యాలు తమ నిర్ణయం చెప్పేటందుకు కొంత గడువు కోరారు అని తెలియవచ్చింది.
ఏదేమైనా ఈ వ్యవహారం మొత్తం ఒక కొలిక్కి వచ్చే వరకూ పరిస్థితి కాస్త గందరగోళంగానే ఉంటుంది. ఎందుకంటే ఈ కొత్త విధానంలో టికెట్ అమ్మకాల ద్వారా తమ వాటా డబ్బులు తిరిగి వస్తాయా లేదా అన్న విషయంలో థియేటర్ల యాజమాన్యాల భయం సమంజసమే.అందుకే పూర్తి నమ్మకం,పారదర్శకత ఉన్నప్పుడే వారు తమ నిర్ణయం తీసుకునేలా పరిస్తితి కనపడుతుంది. ఈ విషయం పై పరిశ్రమ పెద్దలు ఇంకా ఏమీ మాట్లాడలేదు. మరి వారి స్పందన ఎలా ఉంటుందో చూడాలి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ కొత్త టికెటింగ్ పోర్టల్ నిర్ణయం ఎన్ని మలుపులు తిరిగి ఎక్కడ ఆగుతుందో వేచి చూడాలి.