తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా టాలీవుడ్ స్టార్స్ కి కొన్ని కీలక సూచనలు చేసారు. సినిమా టికెట్ రేట్స్ పెంపుదల పై ఆయన స్పందిస్తూ నటులు అందరూ కూడా ఇటీవల పరిశ్రమలో కలకలం రేపిన డ్రగ్స్ అంశంపై చిన్న అవేర్నెస్ వీడియో చేయాలని కోరారు.
ఇటీవల డ్రగ్స్ వలన అనేకమంది యువత చెడుదారి పడుతూ తమ ఆరోగ్యాన్ని జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారని, సమాజంలో సినిమాతో పాటు సినిమా స్టార్స్ కూడా అందరిలో మంచి పేరు కలిగి ఉంటారని, అటువంటి వారు మంచి విషయాల గురించి చిన్న వీడియోలు పెడితే అది మరింతమందికి స్ఫూర్తినిచ్చి చెడు వైపు అడుగులు వేయకుండా చేస్తుందన్నారు. ఇక ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అభినందనలు కురిపించారు.
మరోవైపు థియేటర్స్ యజమానులు కూడా మూవీ ప్రదర్శనకు ముందు డ్రగ్స్, సైబర్ క్రైమ్స్ కి సంబంధించి చిన్న షార్ట్ వీడియోలు ప్రసారం చేస్తే బాగుంటుందని, ఇక టాలీవుడ్ లో టికెట్ రేట్స్ పెంపుదలకు తాము ఎప్పుడూ సుముఖమే అని తెలిపారు రేవంత్ రెడ్డి. మొత్తంగా రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.