పవన్ కళ్యాణ్ తో రేణు దేశాయ్ విడిపోయిన దగ్గరనుంచీ వారి విడాకుల విషయం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. విడాకుల తర్వాత పిల్లలు అకీరా, ఆద్యలను చూసుకుంటూ తన మనసులోని మాటను నిర్భయంగా మాట్లాడటానికి ఆమె ఒక ప్రతీకగా నిలిచారు. పవన్ కళ్యాణ్ తో విడిపోవడం, ఆ తర్వాత తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఒక ప్రైవేట్ ఛానెల్ హోస్ట్, అతిథి చర్చించిన ఓ ఇంటర్వ్యూ గురించి ఆమె ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లో భావోద్వేగంతో కూడిన పోస్ట్ ఒకటి పంచుకున్నారు.
“నాకు ఆవిడ ఎవరో తెలీదు.. ఆవిడ నా గురించే ఎందుకు మాట్లాడారో తెలియదు కానీ మొదటి సారి పబ్లిక్ లో ఒకరు నా తరపున మాట్లాడటం విని నేను ఏడ్చాను. నేను ఏదైనా చెప్తే ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి ఒక రాజకీయ పార్టీకి అమ్ముడుపోయాయని అంటారు. నాకు ఈ వీడియో చూసి నా బాధ అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు అనే ధైర్యం వచ్చింది” అని రేణు అన్నారు.
విడాకుల తర్వాత సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రశ్నల గురించి రేణు షేర్ చేసిన వీడియోలోని అతిథి సుదీర్ఘంగా మాట్లాడారు. విడాకులకు పురుషులను ఎప్పుడూ బాధ్యులను చేయనప్పటికీ, మహిళలు తరచుగా తమను తాము నిరూపించుకోవాల్సి ఉంటుందని ఆ అతిథి అన్నారు. సమంత, రేణు దేశాయ్.. హీరోల అభిమానుల నుంచి నిరంతరం ట్రోలింగ్ కు గురవుతున్న ఆ ఇరువురు మహిళల గురించి ఈ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా ఉదాహరించి చెప్పారు.