ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా విడుదల తేదీని శనివారం ప్రకటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2024 జనవరి 12న విడుదల కానుంది. అయితే ఈ సినిమా కాన్సెప్ట్ కు సంబంధించిన. ఎటువంటి వివరాలూ రివీల్ చేయకుండానే ఒక సరికొత్త పోస్టర్ తో రిలీజ్ డేట్ ను ప్రకటించారు నిర్మాతలు.
ఇక ప్రాజెక్ట్ కే యొక్క తాజా పోస్టర్ ను చూస్తే అందులో నేల పై పడిన పెద్ద చేతి పై ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరుపుతున్నారు. పోస్టర్ లో ఎడారిలో యుద్ధంతో దెబ్బతిన్న ప్రాంతాన్ని తలపించే నేపథ్యం చాలా ఆసక్తికరమైన ప్రభావం కలిగి ఉండడంతో ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఈ పోస్టర్ ను ఆదరిస్తున్నారు.
కాగా విడుదల తేదీని ఖరారు చేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ప్రకటించింది. ’12-1-24 తేదీన ప్రాజెక్ట్ కే ని విడుదల చేస్తున్నాం అని తెలియజేస్తూ ప్రేక్షకులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు చెప్పారు.
ఈ చిత్రం ద్వారా దీపికా పదుకొనె తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమవుతున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం దేశవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానుంది. కంటెంట్ పరంగా, బాక్సాఫీస్ పరంగా ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మాస్టర్ పీస్ లో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.