ప్రముఖ తెలుగు నటుడు.. మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు(83) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్ల వారు జామున ఆయన తుది శ్వాస విడించారు. ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కృష్ణంరాజు తెల్లవారుజామున 3.25 గంటలకు కన్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
తెలుగు చిత్రసీమలో రెబెల్ స్టార్‌గా పేరొందిన కృష్ణంరాజు1940 జనవరి 20న ప.గో.జిల్లా మొగల్తూరులో జన్మించారు. హీరోగా సినీరంగ ప్రవేశం చేసి విలన్‌గానూ అలరించిన కృష్ణంరాజు గారు.. చదువు పూర్తి కాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా పని చేసారు. కొన్ని దశాబ్దాల కాలం ఆయన తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా రాణించారు. మొత్తంగా ఆయన 183 సినిమాల్లో నటించారు. 1966లో చిలకా గోరింక సినిమా ద్వారా చిత్ర రంగం ప్రవేశం చేశారు. 1991 లో కాంగ్రెస్ నుంచి నర్సాపురం లోక్ సభకు పోటీ చేసారు. 1998లో బీజేపీలో చేరిన ఆయన 1999 ఎన్నికల్లో కాకినాడ నుంచి బీజేపీ ఎంపీగా గెలుపొందారు. వాజ్ పేయి హయాంలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖా మంత్రిగా కూడా పని చేసారు.
చివరిగా 2004 ఎన్నికల్లో ఓడిపోయారు. రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు స్వల్ప అస్వస్థతకు గురవ్వడంతో హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని నిన్న అర్ధరాత్రి సమాచారం వచ్చింది. ఆస్పత్రి నుంచి తనయుడు ప్రభాస్ అతడి స్నేహితులు వెళుతూ కనిపించిన ఓ వీడియో ఇంటర్నెట్లో బాగా వైరల్ అయ్యింది.
కృష్ణం రాజుకు ఆరోగ్య పరంగా ప్రమాదం ఏమీ లేదని, ఆయన మరో రెండు మూడు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని కూడా అన్నారు. వయసు పైబడుతున్న తరుణంలో ఆయన కొన్ని అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. దానివల్ల ఆయన సినిమాల్లో నటించడం కూడా బాగా తగ్గించేశారు. ఇటీవలే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించిన కృష్ణంరాజుకు అదే చివరి సినిమాగా ఉంటుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరు.
గతంలో కోవిడ్ సమయంలో కూడా ఒకటి రెండు సార్లు కృష్ణంరాజుకు ఆస్పత్రిలో చికిత్స జరిగింది. తాజాగా మరోసారి అస్వస్థతకు గురవ్వడంతో మళ్ళీ చికిత్స అందిస్తున్నారని తెలిసింది. ఆయన ఆరోగ్యం పై నిరంతరం శ్రద్ధ వహిస్తూ.. ప్రభాస్ అతడి స్నేహితుల బృందం అనుక్షణం ఆయనని కనిపెట్టుకుని ఉంటున్నారని, మళ్ళీ మామూలు మనిషిగా బయటకి వస్తారని అందరూ ఆశించగా.. అనూహ్యంగా కృష్ణంరాజు గారు అందరినీ తీవ్ర విషాదంలో మునిగేలా చేస్తూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం ఎంతో బాధాకరం. ఆయనకు ఆత్మశాంతి కలగాలని కోరుకుందాం. ఓం శాంతి.