మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఆస్కార్ వేడుకకు హాజరై నిన్ననే భారత దేశానికి తిరిగి వచ్చారు. ఇక భారతదేశానికి వచ్చిన వెంటనే న్యూఢిల్లీలో జరిగిన సదస్సులో పాల్గొని అన్ని రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో చరణ్ తన తదుపరి ప్రాజెక్ట్ ఆర్ సి 16 గురించి సంచలన ప్రకటన చేసి అభిమానులతో పాటు అందరికీ షాక్ ఇచ్చారు. ఇందులో రంగస్థలం కంటే బెటర్ గా ఉండే పాత్రను పోషిస్తున్నానని చరణ్ తెలిపారు. చిట్టిబాబు పాత్ర ఇప్పటికీ ఆయన అభిమానులకు ఎంతో ఇష్టం, అందుకే ఈ ప్రకటన వారిని షాక్ కు గురి చేసింది.
2023 సెప్టెంబర్ లో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభమవుతుందని చరణ్ ప్రకటించారు. అంతే కాకుండా ఆర్ సీ16ను పాశ్చాత్య ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం కూడా ఉందని చరణ్ తెలిపారు. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. క్రీడల ఆధారంగా సినిమా తీయాలనుకుంటున్నానని, అది చాలా కాలంగా పెండింగ్ లో ఉందని అన్నారు. ఒక ప్రజెంటర్ తనను బాగా ఆకట్టుకున్న క్రీడ ఆధారంగా సినిమా ఉందా అని చరణ్ ను అడిగారు.
మరో విలేకరి జోక్యం చేసుకుని తెర పై క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీగా నటించవచ్చని చరణ్ తో అన్నారు.వెంటనే స్పందించిన చరణ్ అది అద్భుతంగా ఉంటుందని, కోహ్లీ స్ఫూర్తిదాయకమైన మనిషి అని పేర్కొన్నారు. అవకాశం ఇస్తే అద్భుతంగా ఉంటుందని మెగా పవర్ స్టార్ అన్నారు. మరి ఈ ప్రాజెక్ట్ రూపు దాల్చుతుందా లేదా చూడాలి. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ పొలిటికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.