మెగాస్టార్ చిరంజీవి – బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నారనే వార్త ఎప్పటి నుంచో అనధికారికంగా చక్కర్లు కొడుతుంది.
దర్శకుడు బాబీ.. రవితేజ హీరోగా నటించిన ‘పవర్’ సినిమాతో దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. అలాగే రవితేజ నటించిన మరో చిత్రం బలుపు కు కథను కూడా అందించారు బాబీ. ఇక మెగాస్టార్ చిరంజీవితో బాబీ తీయబోయే సినిమాలో కథ ప్రకారం మరో హీరోకు అవకాశం ఉందట. ఆ పాత్రను రవితేజతో చేయిస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో బాబీ ఈ సినిమా కోసం కలిసారట. పైగా చిరంజీవి హీరో కావడంతో రవితేజ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారని, ఆయనకు భారీ పారితోషికం కూడా అందనుందని ప్రచారం కూడా జరిగింది.
అయితే ఇటీవలే తెలిసిన సమాచారం ప్రకారం రవితేజ ఈ సినిమా నుండి తప్పుకున్నారు అని తెలుస్తుంది. అసలు కారణం ఎంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అందువల్ల రవితేజ పాత్రలో నటించడానికి వేరే హీరోని వెతుకుతున్నారు అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.ఇది ఖచ్చితంగా ప్రేక్షకులను నిరాశ పరిచే విషయమే. మరి రవితేజ పాత్రలో వేరే హీరో నటిస్తారో లేదా ఆయనే మళ్ళీ ఈ సినిమాలో భాగం అవుతారో చూడాలి.
ఇక చిరంజీవి విషయానికి వస్తే మలయాళ సినిమా లూసిఫర్ రీమేక్ అయిన “గాడ్ ఫాదర్” ఈ దసరాకి విడుదలకు సిద్ధం అవగా, మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలు పాత్రలో కనిపించనుంది. అలాగే తమన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఈ సినిమాలో నాగ శౌర్య కీర్తి సురేష్ భర్త పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.