మాస్ మహారాజా రవితేజ హీరోగా ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చిన మూవీ మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ తీసిన ఈ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక తాజాగా ఆయన హీరోగా తెరకెక్కుతున్న సినిమా మాస్ జాతర.
ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో రవితేజ, శ్రీలీల కాంబినేషన్ లో త్రినాధరావు నక్కిన తీసిన ధమాకా మూవీ మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే. దానితో మాస్ జాతర మూవీ పై అందరిలో మరింతగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే విషయం ఏమిటంటే దీని అనంతరం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ ఒక సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది కాగా ఈ సినిమా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనుందని టాక్.
ఇప్పటికే రవితేజని కలిసిన దర్శకుడు కిశోర్ కథతో పాటు స్క్రిప్ట్ మొత్తం వివరించారట. అలానే ఈ మూవీకి అనార్కలి అనే వర్కింగ్ టైటిల్ కూడా పరిశీలనలో ఉందట. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి గ్రాండ్ లెవెల్లో నిర్మించనునున్న ఈ మూవీ యొక్క పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయి.
అలానే ఇందులో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తారని వారి వివరాలు కూడా త్వరలో ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇక ఈ రెండు మూవీస్ తో మంచి విజయాలు సొంతం చేసుకుని కెరీర్ పరంగా బ్రేక్ అందుకోవాలని చూస్తున్నారు రవితేజ. మరి ఇవి రెండు ఆయనకి ఏ స్థాయి విజయాలని అందిస్తాయో చూడాలి