మాస్ మహారాజా రవితేజ నటించిన రావణాసుర సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా విడుదలకు ముందు ప్రమోషన్ లో భాగంగా నిర్మాత అభిషేక్ నామా మీడియాతో కాసేపు ముచ్చటించారు.
ఈ ఇంటర్వ్యూలో అభిషేక్ ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రవితేజ ఇంతకు ముందు రావణాసుర లాంటి సినిమా చేయలేదని, రవితేజను ఎప్పుడూ చూడని అవతారంలో చూస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా షాక్ అవుతారని ఆయన అన్నారు. ఇదొక కొత్త కాన్సెప్ట్ అని, ఇది వర్కవుట్ అయితే చాలా మంది హీరోలు కొత్త తరహా కథలతో ప్రయోగాలు చేస్తారని అన్నారు.
కాగా తమ సినిమాను సొంతంగా విడుదల చేస్తున్నామని, సినిమా కంటెంట్ పై తమకు ఎంతో నమ్మకం ఉందని, సినిమా లాభదాయకంగా ఉంటుందా లేదా అనే విషయంతో తమకు ఇబ్బంది లేదని ఆయన చెప్పారు. అలాగే, ఈ సినిమా వెనుక ఉన్న ఏకైక వ్యక్తి మీరేనా అని అడగ్గా అభిషేక్ అందుకు ఒప్పుకోలేదు.
ఈ సినిమా వెనుక ఉన్న కీలక వ్యక్తి మరెవరో కాదని, ఈ సినిమా నిర్మాతల్లో రవితేజ కూడా ఒకరని ఆయన తెలిపారు. స్క్రిప్ట్ విన్న రవితేజ అభిషేక్ కు సినిమా ప్రొడ్యూస్ చేయమని చెప్పారట. క్రాక్ తర్వాత రవితేజ ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ పై రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు పార్టనర్ గా ఉన్నారు కానీ ఆ సినిమా కలెక్షన్ల పరంగా భారీ దెబ్బ కొట్టింది. ఆ తర్వాత మళ్లీ రావణాసురకి ఆయన సహనిర్మాతగా వ్యవహరిస్తుండటంతో పాటు ఈ సినిమా విజయం పై రవితేజ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ను అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ పతాకాల పై అభిషేక్ నామా, రవితేజ నిర్మించారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి బాణీలు సమకూర్చారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా కథ అందించారు. సుశాంత్, శ్రీరామ్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ కీలక పాత్రలలో కనిపిస్తారు.