మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి సినిమాలో రవితేజ నటించడం.. అందులోనూ ఆయన ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నందున ఆకాశమే హద్దు అన్నట్టుగా ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి.
వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నారు అని మొదటి నుంచి వార్తల్లో ఉంది. ఇది నిజమే అన్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ఫస్ట్ లుక్ ను రివీల్ చేసి అధికారికంగా ప్రకటించారు. వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ విక్రమ్ సాగర్ ఏసీపీగా కనిపించనున్నారు.
టీజర్ లో రవితేజ ఒక చేతిలో గొడ్డలి పట్టుకుని, మరో చేతిలో చిన్న మేకతో నడుస్తున్నారు. ఇది ప్రేక్షకులకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, మరియు రవితేజ పాత్ర ప్రత్యేకమైన టచ్ తో పాటు సాలిడ్ మాస్ అంశాలు కలిగి ఉంటుందని మనం ఆశించవచ్చు.
టీజర్ చూసాక అభిమానులు, ప్రేక్షకులు రవితేజ క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఊహించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయన పాత్ర నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందా లేక చిరంజీవి తరహాలో హీరో పాత్ర ఉంటుందా అనే దాని పై రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు.
మొత్తానికి రవితేజ టీజర్ వాల్తేరు వీరయ్య పై అంచనాలను పెంచింది అనే చెప్పాలి.
బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం రవితేజ హైదరాబాద్ లో షూటింగ్ లో పాల్గొంటుండగా, చిరంజీవి యూరప్ లో పాటల చిత్రీకరణలో పాల్గొంటున్నారు. మరో రెండు వారాల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది.