రవితేజ యొక్క రావణాసుర సినిమా రేపు తెరపైకి రావడానికి సిద్ధంగా ఉంది మరియు స్టైలిష్ ట్రైలర్ మరియు మాస్ మహారాజా యొక్క ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్ కారణంగా సినిమా పై గొప్ప ఆసక్తి నెలకొంది. తన ప్రత్యేకమైన కాన్సెప్ట్‌లు మరియు గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేకు పేరుగాంచిన సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్లో రవితేజ గ్రే షేడ్‌లో కనిపిస్తారని ఇప్పటికే చిత్ర బృందం తెలుపగా.. సినీ ప్రేమికులు అలాంటి పాత్రలో ఆయనను చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా విడుదల కావడానికి ఇంకా కొన్ని గంటల వ్యవధిలో ఉండగా, ఈ సినిమాకు సంబంధించిన ఒక డైలాగ్ బైట్ ఆన్‌లైన్‌లో లీక్ అయి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. లీక్ అయిన సమయం మరియు డైలాగ్ యొక్క అత్యంత వివాదాస్పద స్వభావం చూస్తుంటే, ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని జనరేట్ చేయడానికి రావణాసుర చిత్ర బృందం ఏ ఉద్దేశపూర్వకంగా ఈ వీడియోను లీక్ చేసినట్లు కనిపిస్తుంది.
ఈ లీకైన వీడియోలో రవితేజ మహిళలపై పూర్తిగా కించపరిచే డైలాగ్‌ని నోటికొచ్చినట్లు మాట్లాడటం చూడవచ్చు. “కంచం ముందుకి, మంచం మీదకి ఆడపిల్లలు పిలవగానే రావాలి, లేకపోతే నాకు మండుద్ది” అంటూ రవితేజ పూర్తిగా నిర్దాక్షిణ్యంగా డైలాగ్‌ని పలకగా తెర పై నటి భయాందోళనకు గురి కావడం మనం చూడవచ్చు.
ఈ డైలాగ్‌ను పలువురు నెటిజన్లు అత్యంత అభ్యంతరకరంగా ప్రకటించారు మరియు దీని ప్రభావం తెర పై ఎలా ఉంటుందో మరియు ఒక ప్రముఖ స్టార్ హీరో మహిళల పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పై ప్రేక్షకులు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.
రావణాసురలో ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ మరియు సుశాంత్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి రవితేజ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ధమాకా, వాల్తేరు వీరయ్య చిత్రాలతో వరుస విజయాల మీద ఉన్న మాస్ మహారాజా ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతారో లేదో చూడాలి.