రిషబ్ శెట్టి యొక్క కాంతార చిత్రం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సెప్టెంబర్ 30న కన్నడ బాషలో విడుదలై రోజు రోజుకూ కలెక్షన్లతో పాటు పేరు ప్రఖ్యాతలు పెంచుకుంటూ పోతుంది. కాగా కాంతార చిత్రం తాలూకు డబ్బింగ్ వెర్షన్లు ఈ వారమే విడుదల అయ్యాయి. సినీ ప్రియులైన తెలుగు ప్రేక్షకులతో పాటు హిందీ ప్రేక్షకులు మరియు విమర్శకులు ఈ సినిమా పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అద్భుతమైన నటన, పకడ్బందీ కథనం మరియు ఎంచుకున్న కథ పై చిత్ర బృందం పెట్టుకున్న నమ్మకం సినిమాను ఆకట్టుకునేలా చేశాయి.
ఇక కాంతార చిత్రం చూసిన తర్వాత తెలుగు ప్రేక్షకులు రంగస్థలం సినిమాతో చాలా పోలికలు ఉన్నాయని భావిస్తున్నారు. కాంతార బాక్సాఫీసు వద్ద సాగిస్తున్న ఎదురులేని ప్రయాణం చూసిన తర్వాత, రంగస్థలం నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ గనక పుష్ప లాగా రంగస్థలం చిత్రాన్ని కూడా ప్యాన్ – ఇండియా సినిమా స్థాయిలో విడుదల చేసుంటే.. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం ఇతర భాషల్లో కూడా భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఎంతైనా ఉండేదని అందరూ భావిస్తున్నారు.
రంగస్థలం ఒక సాధారణ సినిమాలా కాకుండా గ్రామీణ స్వభావాన్ని కలిగి ఉంది కాబట్టి కేవలం ఒక వర్గం ప్రేక్షకులకు మాత్రమే పరిమితం కాకుండా ఉండేదని, అలాగే చిత్రం సుకుమార్ కెరీర్ లోనే బెస్ట్ కంటెంట్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అన్ని భాషల్లోనూ విజయం సాధించేది అని.. ఆ రకంగా రంగస్థలం నిర్మాతలు ఒక సువర్ణావకాశాన్ని వదులుకున్నారని ప్రేక్షకులు మరియు సోషల్ మీడియా యూజర్లు బలంగా నమ్ముతున్నారు.
కాంతార చిత్రానికి మరియు సుకుమార్ – రామ్ చరణ్ ల రంగస్థలం సినిమాకి చాలానే పోలికలు ఉన్నాయి. ముఖ్యంగా అచ్యుత్ కుమార్ పాత్ర ప్రకాష్ రాజ్ పాత్రను పోలి ఉంటుంది. రంగస్థలం మాదిరిగానే కాంతార కూడా రివేంజ్ డ్రామానే. కథానాయకుడు శివ సోదరుడు గ్రామ పెద్ద దేవేంద్ర చేతిలో చంపబడతాడు మరియు అతను నిజం తెలుసుకుని తన ప్రతీకారం ఎలా తీర్చుకుంటాడు అనేది కథ. కానీ రంగస్థలం కథతో సారూప్యతలు ఉన్నప్పటికీ, అటవీ ప్రాంతంలో గ్రామీణ దేవుడు అక్కడి ఆచారాలు వంటి ఇతివృత్తం వల్ల రంగస్థలం నుండి భిన్నంగా ఉంటుంది.
భావోద్వేగాల పరంగా రంగస్థలం మరింత బలమైన పాత్రలతో కూడుకుని ఒక షాకింగ్ ట్విస్ట్‌తో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేను కలిగి ఉందని చాలా మంది ప్రేక్షకుల భావన. కాంతార సినిమాలో ముందుగానే చెప్పుకున్నట్లు ఆసక్తికరమైన గ్రామీణ దేవుడి నేపథ్యం, నటీనటుల పెర్‌ఫార్మెన్స్ తో పాటు సినిమాని రూపొందించడంలో చూపించిన నిజాయితీ వల్ల మార్కులు సంపాదించుకుంటుంది.
కొంత మంది నెటిజన్లు కాంతార సినిమాను కన్నడ పరిశ్రమ రంగస్థలంగా అభివర్ణిస్తున్నారు. రిషబ్ శెట్టి, సప్తమి గౌడ, అచ్యుత్ కుమార్, మరియు కిషోర్ ఈ చిత్రంలో తమ అద్భుతమైన నటనకు గానూ ప్రశంసలు అందుకుంటున్నారు.
కాగా ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ని గీతా ఆర్ట్స్ శనివారం విడుదల చేయగా, ఈ చిత్రానికి ఉన్న అద్భుతమైన టాక్ వల్ల ప్రేక్షకులు భారీ సంఖ్యలో ధియేటర్ల వద్దకు తరలి వస్తున్నారు.