ఈ వారం బాక్స్ ఆఫీసు వద్ద రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఒకటి బాలీవుడ్ భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా సినిమా అయిన బ్రహ్మాస్త్ర కాగా.. ఇంకొకటి తెలుగులో అభిరుచి గల నటుడు శర్వానంద్ ప్రధాన పాత్రలో నటించిన ఓకే ఒక జీవితం.
ముందుగా బాలీవుడ్ స్టార్ కపూల్ రణ్‌బీర్ కపూర్ – ఆలియా భట్ జంటగా నటించిన తొలి చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో విజువల్ వండర్‌గా తెరకెక్కింది. ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, డింపుల్ కపాడియా మరియు కింగ్ నాగార్జున అక్కినేని కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్రాన్ని దక్షిణాది రాష్ట్రాల్లో ఎస్ ఎస్ రాజమౌళి సమర్పించడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొత్తం మూడు భాగాలుగా రూపొందనున్న బ్రహ్మాస్త్ర తొలి భాగం నేడు (సెప్టెంబర్ 9న) ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల నడుమ విడుదలైంది.
ఓ వైపు సోషల్ మీడియాలో ఈ సినిమా పై బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తున్నా.. బ్రహ్మాస్త్ర సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి మాత్రం మంచి స్పందనే వస్తుంది. బ్రహ్మాస్త్ర చిత్రాన్ని దర్శకుడు అయాన్ ముఖర్జీ ఒక అద్భుతమైన విజువల్ వండర్ గా తెరకెక్కించారని.. కథ చాలా సింపుల్ గా అనిపించినా.. విజువల్ ఎఫెక్ట్స్‌తో ఆసక్తికరంగా సినిమాని నడిపించారని అంటున్నారు.
ఇక నిజ జీవితంలో భార్యాభర్తలైన రణ్‌బీర్, ఆలియా భట్ మధ్య కెమిస్ట్రీ చాలా చక్కగా ఉందని సోషల్ మీడియా రివ్యూలలో పేర్కొంటున్నారు. ఒక్కో క్యారెక్టర్ ను పరిచయం చేసిన తీరు చాలా బాగుందని చెబుతున్నారు. ఆలియా భట్ మరియు రణ్‌బీర్ నటన అద్భుతంగా ఉందని, అలాగే ముఖ్య పాత్రల్లో నాగార్జున, షారుఖ్ ఖాన్ ల చమక్కు మనిపించే సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయని అంటున్నారు. ట్రయాలజీగా తెరకెక్కిన ఈ సినిమా ఆద్యంతం అలరించింది అని అంటున్న ప్రేక్షకులు. పార్ట్-2 కోసం ఎదురుచూస్తున్నట్లు కూడా చెబుతున్నారు.
ఇక శర్వానంద్ ఓకే ఒక జీవితం సినిమా కూడా చాలా బాగా వచ్చిందని అంటున్నారు. ఎంతో సహజంగా కనిపించే భావోద్వేగాల సమ్మేళనంలా ఉన్న సినిమా చాలా బలమైన కంటెంట్ తో రూపొందినది అని ప్రేక్షకుల్లో అంటున్నారు. చాలా మంచి స్క్రీన్ ప్లేతో సినిమాలో ప్రేక్షకులు పూర్తిగా లీనమయ్యే విధంగా తెరకెక్కిందని, శర్వానంద్ కెరీర్‌లో మరో కలికితురాయిగా నిలిచే సినిమా అవుతుందని, ఇది థియేటర్లలో తప్పక చూడాల్సిన సినిమా అని టాక్ వచ్చింది.