తెలుగు సినిమా పరిశ్రమ లోని పెద్ద కుటుంబాల్లో ఒకటైన దగ్గుబాటి కుటుంబం వారసుడిగా ప్రేక్షకులకి పరిచయమైన రానా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు.
తొలి చిత్రం నుండి వినూత్నమైన కధలు, మరియు పాత్రలనే ఎంపిక చేసుకుంటూ వచ్చాడు రానా. కమర్షియల్ సినిమాలు తక్కువే చేసినా ఎప్పటికప్పుడు వార్తల్లో ఉంటూ క్రేజ్ ను ఎక్కడా తగ్గనివ్వలేదు.
కేవలం హీరో గానే చేస్తాను అని గిరి గీసుకుని కూర్చోకుండా విలన్ పాత్రలు,లేదా ప్రత్యేక పాత్రలు కూడా చేయడం వల్ల ఎలాంటి ఇమేజ్ చట్రం లో ఇరుక్కుపోకుండా ఉండటం రానాకు సాధ్య పడింది.
ఇక బాహుబలి లో భల్లాలదేవుని పాత్రలో అద్భుతంగా నటించి ప్రభాస్ కు ధీటుగా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. కేవలం నటుడి గానే కాక బాహుబలి కి ప్రచార కార్యక్రమాలలో చురుకుగా వ్యవహారించి ఆకట్టుకున్నాడు.
నాలుగేళ్ల క్రితం ఆరోగ్య పరంగా గట్టి ఎదురుదెబ్బ ను ఎదురుకున్నా, ఏమాత్రం నిరాశ పడకుండా చాలా తక్కువ సమయం లోనే కోలుకుని ఔరా అనిపించటమే కాకుండా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు రానా.
అయితే ముందుగా చెప్పుకున్నట్టు ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చినా ఎప్పుడూ స్టార్ హీరో అవ్వాలి అని, అలాంటి భారీ చిత్రాలు చేయాలి అని కానీ ఎప్పుడు ప్రయత్నించని రానా ఇప్పుడు ఇక తన పంథా మార్చుకునే ఆలోచనలో ఉన్నాడు అని సమాచారం.
విరాట పర్వం అనేది తన చివరి ప్రయోగాత్మక చిత్రం అనీ, ఇక మీదట ఫ్యాన్స్ కి నచ్చే కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తాను అని చెప్పినట్టు తెలుస్తోంది. మరి రానా తీసుకున్న కొత్త నిర్ణయం యే రకంగా తన కెరీర్ ను మార్చబోతుందో చూద్దాం.