ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఈ జూలైలో వారియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి తమిళ దర్శకుడు లింగుస్వామి తెలుగు, తమిళ భాషల్లో దర్శకత్వం వహించారు. తప్పకుండా ఈ సినిమాతో తమిళంలో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకోవాలని హీరో రామ్ అనుకున్నారు.
అయితే ఆ సినిమా ఆయన ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. అయితే ఆ సినిమా ఇప్పుడు యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది.
ది వారియర్ హిందీ డబ్బింగ్ వెర్షన్ కేవలం 1 నెలలోనే 100M కంటే ఎక్కువ వీక్షణలను పొందింది. థియేటర్లలో సినిమా రిజల్ట్ చూస్తుంటే ఇది సంచలన స్పందనగా చెప్పుకోవచ్చు. ది వారియర్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో భారీ డిజాస్టర్‌గా నిలిచింది.
రామ్ పోతినేని హిందీ డబ్బింగ్ చిత్రాలకు ఉన్న క్రేజ్ కొత్తది కాదు. ఆయన నటించిన సినిమాల్లో యూట్యూబ్‌లో హిందీలో డబ్ చేసి విడుదలై వంద మిలియన్ వ్యూస్‌ను అందుకున్న ఏకైక చిత్రం వారియర్ మాత్రమే కాదు. ఇంతకుముందు కూడా హీరో రామ్‌కి సంబంధించిన కొన్ని చిత్రాలు యూట్యూబ్‌లో 100 మిలియన్ల వ్యూస్ సాధించాయి.
గణేష్ సినిమాతో మొదట హిందీ ప్రేక్షకులను ఆకర్షించారు రామ్. కాజల్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం తెలుగులో అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ, హిందీ డబ్బింగ్ యూట్యూబ్ వెర్షన్‌లో విజేతగా నిలిచింది. ఆ తర్వాత నేను శైలజ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టింది. ఈ చిత్రం కూడా హిందీలో కూడా డబ్ చేయబడి యూట్యూబ్‌లో 100 మిలియన్ల వీక్షణలను అందుకుంది.
హైపర్, ఇస్మార్ట్ శంకర్, ఉన్నది ఒకటే జిందగీ మరియు హలో గురు ప్రేమ కోసమే హిందీ డబ్బింగ్ వెర్షన్లకి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ సినిమాలు యూట్యూబ్‌లో 100 మిలియన్ల వ్యూస్‌ని సాధించాయి. ఇప్పుడు అదే విధంగా 100 మిలియన్ల వ్యూస్‌ను రాబట్టి ‘ది వారియర్’ సినిమాతో రామ్ పోతినేని మరో రికార్డు సృష్టించారు.
వరుసగా ఏడు హిందీ డబ్బింగ్ చిత్రాలతో యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ సాధించిన హీరోగా సౌత్ ఇండస్ట్రీలో రికార్డు సృష్టించారు హీరో రామ్.
రామ్ తదుపరి చిత్రం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా విడుదల కాబోతుంది, మరి ఆ సినిమాకు హిందీ ప్రేక్షకుల నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూద్దాం.