ఆర్ ఆర్ ఆర్ సినిమాతో భారీ విజయాన్ని మాత్రమే కాకుండా అపారమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్. అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమా కంటే ముందే.. రామ్‌చరణ్ మరియు ఎన్టీఆర్ వేర్వేరు సినిమాలకు కమిట్ అయి ఉన్నారు.
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ సినిమాని కొద్ది రోజులు పక్కన పెట్టి దర్శకుడు శంకర్ కమల్ హాసన్ తో “భారతీయుడు 2” సినిమా షూటింగ్ పట్టాలెక్కించారు. ఇక త్వరలోనే రామ్ చరణ్ సినిమా కూడా తిరిగి పట్టాలెక్కబోతుందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఈ సినిమా కాకుండా రామ్ చరణ్ “జెర్సీ” దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా ఒక సినిమాని ఒప్పుకున్నారు.
“ఉప్పెన” సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన బుచ్చిబాబు సనా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు. దీంతో రెండవ సినిమాతోనే ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశాన్ని చేజిక్కించుకున్నారు బుచ్చిబాబు. అయితే మరోవైపు ఎన్టీఆర్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో బుచ్చిబాబు ఎన్టీఆర్ సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది. ఆర్ ఆర్ ఆర్ తరువాత ఎన్టీఆర్ త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక.సినిమా చేస్తారని కొద్ది రోజులు ప్రచారం జరిగింది. అయితే ఆ చిత్రం స్థానంలో ఇప్పుడు కొరటాల శివ సినిమా వచ్చి చేరింది.
ఇలా ఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత దర్శకుడు బుచ్చిబాబుతో ఎన్టీఆర్.. గౌతమ్ తిన్ననూరితో రామ్ చరణ్ సినిమాలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో.. ఇరు దర్శకులకు కూడా ఈ స్టార్ హీరోల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి అని సమాచారం. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ రెండు ప్రాజెక్ట్ లను పక్కన పెట్టే యోచనలో ఇద్దరు హీరోలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్ ఆర్ ఆర్ వంటి ల్యాండ్ మార్క్ విజయం తరువాత ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి చరణ్ కానీ ఎన్టీఆర్ కానీ ఇష్టపడట్లేదు. అంతే కాకుండా కేవలం స్టార్ లేదా హిట్ డైరెక్టర్లతో మాత్రమే పని చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
ఈ నిర్ణయం వల్ల అటు గౌతమ్, ఇటు బుచ్చిబాబు కెరీర్ ఒక రకంగా సంకటంలో పడింది అనే చెప్పాలి. అగ్ర హీరోతో సినిమా ఛాన్స్ దొరికింది అనుకునే లోపు ఇలా సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండా ఇరుక్కుంటే వేరే సినిమా చేస్ అవకాశం కూడా ఉండదు. మరి రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఇద్దరూ కూడా ఈ కొత్త దర్శకులతో సినిమాలను ముందుకు తీసుకు వెళతారో లేదా చూడాలి.