తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ చాలా ఆసక్తికరంగా రూపుదిద్దుకుంది. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న చరణ్, రెండవ సినిమా మగధీరతో ఏకంగా ఇండస్ట్రీ హిట్ సాధించారు. ఆ తరువాత అట్టర్ డిజాస్టర్‌లతో పాటు సూపర్ హిట్ చిత్రాలను కూడా అందుకున్నారు. అయితే తొలి చిత్రంతోనే స్టార్ గా అవతరించిన చరణ్ తన నటన విషయంలో మాత్రం గతంలో ట్రోల్ చేయబడ్డారు. అయితే తరువాత మాత్రం సరైన సినిమాలను ఎంచుకుని నటనకు కూడా ప్రశంసలు అందుకున్నారు.
అయితే రామ్ చరణ్ స్క్రిప్ట్ ఎంపిక మరియు నటనలో మార్పు రావడంలో ఒక సినిమా ప్రధాన పాత్ర పోషించింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ సినిమానే ధృవ.. 2016 లో వచ్చిన ఈ చిత్రం అటు మెగా అభిమానులతో పాటు ఇతర తెలుగు ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకుంది. ధృవ చిత్రంలో రామ్ చరణ్ తనలోని ఒక పూర్తి భిన్నమైన కోణాన్ని చూపించారు. అంతే కాకుండా పాత్ర కోసం ఎంతో కష్టపడి దేహ దారుఢ్యాన్ని కూడా ప్రదర్శించారు.
తమిళ భాషలో వచ్చిన తని ఒరువన్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ధృవ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ రాబోతుంది. అయితే ఈ సీక్వెల్ కు సురేందర్ రెడ్డి కాకుండా ఒరిజినల్ ను తీసిన దర్శకుడు మోహన్ రాజా నేతృత్వం వహిస్తారని తెలుస్తోంది.
మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రేపు విడుదల అవుతుంది. ఆ చిత్రం ప్రచార నిమిత్తం ఈరోజు మీడియా ప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు.
కాగా ఈ ప్రెస్ మీట్ సందర్భంగా నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ, మోహన్ రాజా నిజానికి ధృవ సీక్వెల్ ఆలోచనతో రామ్ చరణ్ వద్దకు వచ్చినపుడు, ఆయన చేతికి లూసిఫర్ రీమేక్ బాధ్యతను అప్పగించాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. ఈ వార్త విన్న మెగా అభిమానులు ధృవ 2 సినిమా నిజంగా తెరకెక్కితే బాగుంటుందని ఆశిస్తున్నారు.
ఇక గాడ్ ఫాదర్ రైట్స్ కొనే అవకాశం ఇచ్చిన రామ్ చరణ్ కి నిర్మాత ఎన్వీ ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. నిజానికి రామ్ చరణ్ ఈ రీమేక్ రైట్స్ కొనడానికి ఏ నిర్మాతనైనా పిలిచే అవకాశం ఉంది, కానీ ఆయన మమల్ని ఎంచుకున్నారని అన్నారు. నిజానికి లూసిఫర్‌ని చిరంజీవి రీమేక్ చేయాలనే ఆలోచన కూడా రామ చరణ్ సూచించడం విశేషం.