సూపర్ స్టార్ రజినీకాంత్. పరిచయం అక్కర్లేని పేరు. ప్రాంతాలకు అతీతంగా ప్రేక్షకుల ఆదరణ, అభిమానం పొందిన నటుడు. దశాబ్దాలుగా తమిళ ఇండస్ట్రీ నంబర్ వన్ హా చలామణి అయిన రజినీ సినిమాలు తెలుగులోనూ డబ్ అయి బ్లాక్ బస్టర్ అయ్యాయి.
2016 లో వచ్చిన కబాలి చిత్రం అయితే ఒక్క చిన్న టీజర్ తో దేశం మొత్తం అట్టుడుకిపోయేలా చేసింది. అయితే అంచనాలను అందుకోవడం లో కబాలి తీవ్రంగా నిరాశ పరచడం, ఆ వెంటనే అదే కాంబినేషన్ లో వచ్చిన కాలా కూడా పేలవంగా ఉండటం హీరోగా, స్టార్ గా రజినీ ఇమేజ్ ను దెబ్బ తీశాయి. పా రంజిత్ ఇతర హీరోలతో మంచి సినిమాలు తీసి రజినీతో తీసిన రెండు సినిమాలు చేదు జ్ఞాపకాలు గా మిగిలి పోయాయి.
ఇక ఆ తరువాత సీక్వెల్ హైప్ తో వచ్చిన 2.0 , పెట్టా చిత్రాలు కాస్త పర్వాలేదు అనిపించినా రజినీ నుండి ఆయన స్థాయికి తగ్గ హిట్ రాలేదు అన్నది వాస్తవం. పోయిన దీపావళికి వచ్చిన అన్నాత్తే(తెలుగులొ పెద్దన్న) ఏకంగా డిజాస్టర్ అయింది.ఇక రజినీ చేయబోయే తదుపరి సినిమాను ఇదివరకే అనౌన్స్ చేసారు. యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కాంబినేషన్ లో మరో యువ సంచలనం అనిరుధ్ సంగీత సారథ్యంలో సినిమా ఉంటుంది అని అధికారికంగా ప్రకటించారు.
అయితే ఆ ప్రాజెక్టు అనౌన్స్ అయినా తరువాత నెల్సన్ – హీరో విజయ్ కాంబినేషన్ లో వచ్చిన బీస్ట్ సినిమా అంచనాలను అందుకోలేక పోయింది. అందువల్ల ఇప్పుడు రజినీ సినిమా సంగతి ఏం చేస్తాడోనని అభిమానులు కాస్త కంగారు పడుతున్నారు.
అయితే సినిమా స్క్రిప్ట్ దగ్గరనుంచి అన్నీ పక్కాగా కుదిరేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని తాజా వార్తలు వినిపిస్తున్నాయి. కథ స్వయంగా రజినీకాంత్ యే రాయనున్నాడు, స్క్రీన్ ప్లే భాధ్యతను సీనియర్ డైరెక్టర్ అయిన కే ఎస్ రవి కుమార్ కి అప్పగించారని సమాచారం. ఇక నటీనటుల విషయంలో కూడా భారీ తారాగణం యే ఉండబోతుంది అని అంటున్నారు.
వీటన్నిటికీ తోడు అనిరుధ్ సంగీతం సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. యూత్,మాస్ ఆడియన్స్ ను ఉర్రూతలుగించడం లో అనిరుధ్ కి ఎవరూ సాటి రారు. కొసమెరుపు ఏమిటంటే ఈ సినిమాకి టైటిల్ బాస్ అనుకుంటున్నారు అని తెలిసింది.