సినిమా ఇండస్ట్రి అనేది అప్పుడప్పుడు చాలా చిత్రమైన విషయాలకి ఉదాహరణగా నిలుస్తుంది. ఒక్కోసారి ఏ ఫార్ములా లేదా కాంబినేషన్ వల్ల సక్సెస్ పక్కా అంటారో.. సమయం సరిగా లేనప్పుడు ఆ ఫార్ములానే మళ్ళీ వర్కౌట్ కాదు అంటారు. అది ఒక హీరో – దర్శకుడి కాంబో కావచ్చు లేదా హీరో – హీరోయిన్ ల జోడీ కావచ్చు. ఇప్పుడు అలాంటి ఒక కాంబినేషన్ గురించే ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.ఆ కాంబినేషన్ మరేదో కాదు సూపర్ స్టార్ రజనీకాంత్ – రమ్యకృష్ణ ల జోడినే.
రజనీకాంత్ నటించిన `పడయప్పా` తెలుగులో `నరసింహ`గా 1999లో విడుదలై రెండు భాషల్లోనూ సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రజనీకాంత్ కెరీర్ లో ఆ సమయానికి అత్యధిక వసూళ్లని రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచి బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో రికార్డులు తిరగరాసింది. ఇందులో సౌందర్య హీరోయిన్ లగా నటించారు. ఇలా మొదట హీరోయిన్ గా, ఆ తరువాత విలన్ గా మారే పాత్రలో రమ్యకృష్ణ నటించారు.
ఆ సినిమాలో నీలాంబరిగా రమ్యకృష్ణ నటన అధ్బుతం అనే చెప్పాలి. ఎంతగా అంటే ఒక దశలో ఆ పాత్ర ముందు ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ తేలిపోయాడా అని ప్రేక్షకులు భావించేలా, ఈ సినిమా విజయంలో రమ్యకృష్ణ పాత్ర అంత ప్రభావం చూపింది. ఇప్పటికీ రమ్యకృష్ణ కెరీర్ లో నీలాంబరి సైతం ఒక మైలురాయిగా, ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రగా నిలిచిపోయింది. ఐతే అంతటి అద్భుతమైన పాత్ర మరియు సినిమా తరువాత రమ్యకృష్ణ-రజనీ కాంత్ లని మళ్ళీ కలిసి ఒక సినిమాలో చూసే అవకాశం ప్రేక్షకులకి కలగలేదు.
మళ్లీ ఇన్నాళ్లకు ఈ ఇద్దరు కలిసి నటించబోతున్నారని తాజాగా వినిపోస్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తాజాగా `జైలర్` సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే విజయ్ నటించిన ‘ బీస్ట్ ‘ సినిమాకి దర్శకత్వం వహించిన నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. జైలర్ పాత్రలో రజనీ నటిస్తున్న ఈ సినిమాని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. తాజాగా `విక్రమ్` వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాకి ప్రేక్షకులని ఉర్రూతలూగించే సౌండ్ ట్రాక్ ను అందించి అందరి చేతా శభాష్ అనిపించుకున్న యువ సంగీత కెరటం అనిరుధ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇందులో రజినీకాంత్ సరసన హీరోయిన్ గా త్రిష నటిస్తున్నారు.
అయితే ఈ సినిమాలో హీరో రజనీకాంత్ తో పాటు మరో ముఖ్య పాత్రలో రమ్యకృష్ణ నటిస్తోందని తాజాగా సమాచారం అందింది. ఇది ఖచ్చితంగా ప్రేక్షకులకు సినిమా పట్ల ఆసక్తిని కలిగించే విషయమే. అయితే ఇందులో రమ్యకృష్ణ పాత్ర ఎలా ఉంటుందో.. మళ్ళీ విలన్ పాత్ర పోషిస్తున్నారా లేక సహాయక పాత్ర చేస్తున్నారా అనేది ఇంకా తెలియ రాలేదు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్ ఆగస్టు 22 నుంచి మొదలవుతుందట. ఆ షెడ్యూల్ మొత్తం జైల్ నేపథ్యంలో సాగుతుందట. ఈ సినిమా కోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ జైల్ సెట్ ని నిర్మించారు. ఇందులోనే షూటింగ్ కు సంబందించిన ప్రధాన భాగాన్ని పూర్తి చేయనున్నారట.
అక్టోబర్ వరకు ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది . ఆ పైన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని పూర్తి చేసి త్వరలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిసింది. 23 ఏళ్ళ విరామం తరువాత మళ్లీ కలిసి నటిస్తున్న రజనీ.- రమ్మకృష్ణల కాంబినేషన్ ప్రేక్షకులను అప్పటి లాగే అలరిస్తారా లేదా చూడాలి.