ప్రముఖ సినీ రచయిత, రాజమౌళి తండ్రి వి. విజయేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత ముప్పై ఏళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో రచయితగా ఉన్న ఆయన ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందజేశారు. ఆయన పూర్తి పేరు కోడూరి విశ్వ విజయేంద్ర ప్రసాద్ కాగా, చిత్ర పరిశ్రమలో మాత్రం వి. విజయేంద్ర ప్రసాద్ గా ప్రసిద్ధి చెందారు.
1988 లో విడుదలైన జానకి రాముడు చిత్రంతో ఆయన రచయితగా తన సినీ ప్రయాణం మొదలుపెట్టిన విజయేంద్ర ప్రసాద్ ఇటీవలే విడుదలై తెలుగు సినిమా స్థాయిని, ఖ్యాతిని అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన ఆర్ ఆర్ ఆర్ సినిమా వరకూ రచయితగా పని చేశారు. కేవలం తెలుగులోనే కాక ఇతర భాషల్లో కూడా ఆయన కథలను అందించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన బజరంగీ భాయ్ జాన్, తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన మెర్శల్ చిత్రానికి ఆయన కథను అందించగా.. అవి బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్యాన్ ఇండియా సినిమాకి కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. అయితే ఆ సినిమాతో పాటు బజరంగీ భాయ్ జాన్ సినిమా సీక్వెల్ కు కూడా కథను సిద్ధం చేస్తున్నారు అని వార్తలు వచ్చాయి.అయితే ఆ వార్తలను ఇంకా అధికారికంగా ఖరారు చేయలేదు.ఇదిలా ఉండగా.. మరో భారీ సినిమాలో విజయేంద్ర ప్రసాద్ భాగం కాబోతున్నారు అని తాజాగా వార్తలు వస్తున్నాయి.
1770 – ఏక్ సంగ్రామ్ అనే సినిమాకి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ వర్క్ భాద్యతలు అందుకోనున్నారట. Anandamath – the story of sanyasis నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు అని సమాచారం. బ్రిటిష్ పాలనలో 1770 లో జరిగిన ఒక సన్యాసిల తిరుగుబాటు నేపథ్యంలో ఉంటుందట. ఒకఅగ్ర హీరో ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తారని, అంతే కాకుండా తెలుగులో ఒక నవ యువ దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ ఆగస్ట్ 15న అంటే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.
మరి ఆ అగ్ర హీరో ఎవరో, యువ దర్శకుడు ఎవరో తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. దేశభక్తి నేపథ్యంలో వచ్చే సినిమా అంటే ప్రేక్షకులు నిజానికి అంత ఆసక్తి చూపరు.. ఎందుకంటే సినిమా ఎంత బాగున్నా ఎన్ని వీరోచిత పోరాట సన్నివేశాలు ఉన్నా చివరికి సినిమా విషాదాంతం అవుతుంది కాబట్టి. ఐతే ఆర్ ఆర్ ఆర్ సినిమాలో రాజమౌళి తెలివిగా ఆ సినిమాని కాల్పనిక సంఘటనలతో తెరకెక్కించి ముగింపులో విషాద ఛాయలు ఉండకుండా జాగర్త పడ్డారు. మరి ఏక్ సంగ్రామ్ సినిమా కూడా అదే బాటలో నడుస్తుందా లేదా అనేది చూడాలి.