‘ఆర్ఆర్ఆర్’ పై ప్రపంచ వ్యాప్తంగా కురుస్తున్న ప్రశంసల జల్లులలో మునిగి పోయి అత్యంత సంతోషంగా ఉన్న రాజమౌళి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ గురించి హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ చేసిన కామెంట్స్ చూసి సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు.
మన తెలుగు సినిమా కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేసిన దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం ఇండియన్ సినిమాకే బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. తాను తెరకెక్కించిన “రౌద్రం రణం రుధిరం” హాలీవుడ్ లో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించిన వేళ ఆయనకు మరో ఆసక్తికరమైన అనుభవం ఎదురైంది.
ఇటీవల హాలీవుడ్ లో జరిగిన మీట్ లో వరల్డ్ సినిమా బిగ్గెస్ట్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ రాజమౌళిని కలిసి ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి కొద్దిసేపు చర్చించడం సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మరి వీరి కలయిక లో వచ్చిన వీడియో కూడా భారీ ఎత్తున వైరల్ కాగా ఇటీవలే దానికి సంభందించిన వీడియో చిత్ర నిర్మాతలు ట్విట్టర్లో షేర్ చేశారు.
ఈ వీడియోలో జేమ్స్ కామెరూన్ రాజమౌళి మరియు కీరవాణితో RRR కు సంభందించిన ప్రతి చిన్న విషయాన్నీ చిన్న చిన్న అంశాలతో సహా చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతే కాకుండా జేమ్స్ కామెరూన్ తమ చిత్రాన్ని రెండు సార్లు చూసారు అని ఆయన భార్య తెలపడంతో రాజమౌళి మరింత ఎగ్జైట్ కావడం ఈ వీడియోలో చూడొచ్చు.
ఇక అవతార్ సృష్టికర్త అయిన కామెరూన్ ఆర్ ఆర్ ఆర్ ను పొగడటం ఒకెత్తు అయితే రాజమౌళితో సంభాషణ ముగించినప్పుడు చెప్పిన మాట ఇప్పుడు సంచలనంగా మారింది. జేమ్స్ కామెరూన్ రాజమౌళి తో “మీరు ఒకవేళ ఇక్కడ(హాలీవుడ్ లో) సినిమా తీయాలి అనుకుంటే, ఒకసారి మనం మాట్లాడుదాం” అని అన్నారు. దీనితో ఈ సెన్సేషనల్ స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయి భారతీయ సినీ ప్రేమికులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
ఈ నెలలో లాస్ ఏంజిల్స్ లో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ లో రాజమౌళి జేమ్స్ కామెరూన్ ను కలిశారు, అక్కడ ఆర్ఆర్ఆర్ ఉత్తమ విదేశీ భాషా చిత్రం మరియు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ – నాటు నాటుకు రెండు అవార్డులను గెలుచుకుంది. అవతార్: ది వే ఆఫ్ వాటర్ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ అవార్డును అందుకుంది, దీనికి ఆర్ఆర్ఆర్ కూడా నామినేట్ చేయబడింది.