RRR సినిమా ప్రకటించినప్పటి నుండి ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ అభిమానుల మధ్య నిరంతరం వాదోప వాదనలు, పరస్పర ట్రోలింగ్ లతో నిరంతరం పోటీ వాతావరణం ఉంటూ వచ్చింది.
ఏ చిన్న అవకాశం వచ్చినా ఇద్దరూ పోలికలలో మునిగిపోతూ వచ్చారు. ఇక RRR సినిమా బృందం నుండి లేదా ఇతర ప్రముఖుల నుండి వచ్చిన ప్రతి మాటను కూడా భూతద్దంలో చూస్తూ అన్నిటినీ వివాదాలుగా మార్చుతూ వచ్చారు.తాజాగా రాజమౌళి చేసిన ప్రకటన ఈ అభిమానుల మధ్య మరో చిచ్చు రేపుతోంది.
ఎన్టీఆర్ మరియు చరణ్ టాలీవుడ్ అత్యుత్తమ డ్యాన్సర్లలో ఒకరు. RRRలోని నాటు నాటు పాటలో వారిద్దరూ అద్భుతంగా నటించారు. రిలీజ్ అయినప్పటి నుండి ఈ పాట ప్రపంచ వ్యాప్తంగా అత్యత్భుతమైన స్పందన తెచ్చుకుంది.
ఇటీవల వెస్ట్ లో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్‌లో ఈ పాట గురించి చర్చ జరిగినప్పుడు, జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన డ్యాన్సర్ అని అందరికీ తెలుసు, అతనికి పాట ముందు ప్రాక్టీస్ చేసే అవసరం లేదని రాజమౌళి చెప్పారు.
చరణ్ టైమింగ్‌కు తగ్గట్టుగానే ఎన్టీఆర్ నాటు నాటు కోసం సాధన చేసారన, అంతే కానీ మాములుగా అయితే తనకు ఎలాంటి ప్రాక్టీస్ అవసరం లేదని అన్నారు.
ఈ ప్రకటన వల్ల ఇప్పుడు ఇద్దరు హీరోల అభిమానులు ఎవరికి నచ్చిన అర్ధాలు వాళ్ళు తీసేసుకుని గొడవ పడుతున్నారు. ఒక వైపు ఎన్టీఆర్ అభిమానులు ఇది తమ ఆధిపత్యానికి చిహ్నంగా సంబరాలు చేసుకుంటున్నారు. రాజమౌళి ప్రకారం ఎన్టీఆర్ మంచి డ్యాన్సర్ అని చెప్పుకుంటున్నారు.
మరో వైపు, రామ్ చరణ్ అభిమానులు తమ హీరో డ్యాన్స్ సామర్థ్యాన్ని సమర్థిస్తున్నారు. మా హీరో పక్కన డాన్స్ చేయడానికి ఎన్టీఆర్ ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది అని గొప్పగా చెప్పుకుంటున్నారు.
ఈ ఇద్దరి హీరోల మధ్య ఈ ఆన్‌లైన్ ముష్టి గొడవలు కొత్తేమీ కాదు. సినిమాలోని ప్రతి ఎలిమెంట్‌ని స్కాన్ చేసి, తమ హీరోని ఎలివేట్ చేయడానికి మరియు అభిమానులచే ఇతర హీరోని ట్రోల్ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ చెడు ధోరణికి ఇరు వర్గాల అభిమానులు కూడా ఎంత త్వరగా ముగింపు పలికితే అంత మంచిది. అందులోనూ ప్రత్యేకించి RRR కి సీక్వెల్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఇలాంటివి అనవసరం అనే చెప్పాలి.
అంతే కానీ ప్రతి చిన్న విషయానికి అభిమానులు ఒక్కో ప్రకటనను వక్రీకరించి వివాదం చేయడం ఏమాత్రం సరైంది కాదు. RRR సినిమాని ప్రపంచవ్యాప్తంగా ప్రతి మూలలో మెచ్చుకున్నారు. వారు దాని గురించి సంతోషించి సినిమా అంత పేరుని తెచ్చుకున్నందుకు గర్వించాలి. అలా కాకుండా నిత్యం వెర్రి తగాదాలలో మునిగితేలడం వారికి ఏ రకంగానూ మేలు చేయదు.