అల్లు అర్జున్ అభిమానుల ఎంతగానో ఎదురు చూస్తున్న 2021 బ్లాక్బస్టర్ ‘పుష్ప: ది రైజ్’ యొక్క సీక్వెల్ కు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప 2’.
‘పుష్ప 2: ది రూల్’ నిర్మాతలు బుధవారం ఒక ప్రత్యేక వీడియోను అభిమానులతో పంచుకున్నారు మరియు ఈ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ గురించి తాజా అప్డేట్ ఇచ్చారు. ఏప్రిల్ 7న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా సినిమా టీజర్ ను విడుదల చేయనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ బుధవారం ట్విటర్ ద్వారా ప్రకటించింది.
‘వేర్ ఈజ్ పుష్ప’ పేరుతో విడుదల చేసిన వీడియోలో పుష్ప తుపాకీ గాయాలతో తిరుపతి జైలు నుంచి తప్పించుకుని పారిపోతున్నట్లు వెల్లడించడం మనం చూడవచ్చు. ఈ వీడియోలో అల్లర్లు, వీధుల్లో ప్రజలు ధర్నా చేస్తూ తిరగడం వంటి కొన్ని వేగవంతమైన దృశ్యాలను కూడా చూపించారు. అయితే, ఇది రెండో భాగంలోని వాస్తవ దృశ్యాలా లేక కేవలం ఈ వీడియో కోసం ఏర్పాటు చేసిన కొన్ని యాదృచ్ఛిక షాట్లా అనేది తెలియరాలేదు.
మొదటి సినిమా పుష్ప: ది రైజ్ చివర్లో ప్రధాన ప్రతినాయకుడిగా పరిచయమైన ఫహద్ ఫాజిల్ మరియు అల్లు అర్జున్ ల మధ్య ముఖాముఖి సన్నివేశాల పై రెండవ భాగం దృష్టి పెడుతుందట. మొదటి భాగం నుంచి శ్రీవల్లి పాత్రలో కొనసాగనున్న రష్మిక మందన్న కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్, సునీల్, జగదీష్ కూడా మొదటి భాగం నుండి అవే పాత్రల్లో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 7న విడుదల కానున్న పుష్ప 2 టీజర్ ప్రేక్షకుల అంచనాలను అందుకోవాలని కోరుకుందాం.