ఇప్పటికే ఉత్కంఠభరితంగా ఉన్న పుష్ప-2 తారాగణంలో మరో ఆసక్తికర అదనపు బలం తోడైంది. భారీ క్రేజ్ ఏర్పరచుకున్న ఈ సీక్వెల్ కోసం దర్శకుడు సుకుమార్ తన సెంటిమెంట్ విలన్ ను ఎంచుకున్నారు. సుకుమార్ ‘నాన్నకు ప్రేమతో’, ‘రంగస్థలం’ చిత్రాల్లో విలన్ పాత్రల్లో నటించి మెప్పించిన జగపతిబాబు తాజాగా సుకుమార్ ‘పుష్ప: ది రైజ్’లో నెగెటివ్ రోల్ కోసం ఎంపికయ్యారట.
ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా సాలార్ సినిమాలో కూడా జగపతి బాబు విలన్ గా కనిపించనున్నారు. ప్రస్తుతం ‘ సాలార్’ షూటింగ్ జరుగుతుండగా, ‘రాజా మనార్’గా జగపతిబాబు లుక్ ఇప్పటికే మంచి ప్రశంసలను తెచ్చిపెట్టింది. ఇక సుకుమార్ పుష్ప 2 లో జగపతిబాబు లుక్, క్యారెక్టర్ ను ఎలా ప్లాన్ చేశారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కాగా పుష్ప తొలి భాగం కంటే పుష్ప 2 హద్దులు దాటి ఇంటర్నేషనల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర అన్ని అడ్డంకులను ఎదుర్కొనబోతుంది. రష్మిక మందన శ్రీ వల్లిగా, ఫహద్ ఫాజిల్ పుష్ప 2లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో తాము తొలి భాగంలో చేసిన పాత్రల లోనే కనిపించనుండగా.. వారి పాత్ర చిత్రణ అందరినీ ఆశ్చర్యపరుస్తుందని అంటున్నారు.
సుకుమార్ అండ్ టీం చాలా సమయం వెచ్చించి పుష్ప 2 స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకున్నారు. అందుకే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి వారు ఇంతదాకా ఎలాంటి హడావుడీ చూపించలేదు. ఇక ఇప్పుడు సుకుమార్ మరియు ఆయన చిత్ర బృందం తమ పురోగతితో సంతృప్తి చెంది, వరుస షెడ్యూల్స్ లో ప్రొడక్షన్ పార్ట్ ను పూర్తి చేయడానికి అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నారు.