పూరి జగన్నాధ్ అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒకదశలో అత్యంత ప్రజాదరణ పొందిన దర్శకులలో మొదటి స్థానంలో ఉండేవారు. అలాగే అత్యంత డిమాండ్ ఉన్న దర్శకులుగా కూడా కొన్నేళ్ల పాటు మార్కెట్ లో తన హవాను కొనసాగించారు. ఇడియట్, పోకిరి, టెంపర్ వంటి అద్భుతమైన చిత్రాలను టాలీవుడ్ కి ఇచ్చిన ఘనత ఆయన సొంతం. ఏ హీరోకి అయిన తనదైన ప్రత్యేకతను జోడించి తద్వారా హీరోయిజాన్ని అద్భుతంగా పండించడంలో పూరికి మరెవరూ సాటి రారు.
అందుకే ఒకప్పుడు అందరు హీరోలు ఒక్కసారైనా పూరితో పని చేయాలని అనుకునేవారు. బాలీవుడ్‌లో కూడా పూరి మంచి పేరు తెచ్చుకున్నారు. పోకిరి సినిమా హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా వాంటెడ్‌గా రీమేక్ చేయబడి బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. అంతే కాకుండా ఆ సమయంలో బాలీవుడ్‌లో అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా నిలవడంతో పాటు సల్మాన్ ఖాన్ కు బాక్స్ ఆఫీస్ వద్ద కమ్ బ్యాక్ హిట్ గా కూడా నిలిచింది. పూరి ఇండియన్ సినిమా లెజెండ్ అమితాబ్ బచ్చన్ తో బుద్దా హోగా తేరా బాప్ అనే హిందీ సినిమా కూడా చేసారు, అది కూడా చక్కని విజయం సాధించింది. ఇలా తన ఫార్మ్ బాగా ఉన్న సమయంలో.. పూరి జగన్నాధ్ ఎంతో శక్తివంతమైన స్థానంలో ఉన్నారు. కానీ గత కొన్నేళ్లుగా తన కెరీర్‌లో అత్యల్ప దశలో ఉన్నారని చెప్పచ్చు.
టెంపర్ నుంచి పూరి టాలీవుడ్‌లో తన సత్తా చాటేందుకు చాలా కష్టపడుతున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పటికీ.. అది ఆయన స్థాయి సినిమా కాదు అనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. హార్ట్ ఎటాక్, లోఫర్, రోగ్ మరియు ఇస్మ్ వంటి అతని ఇటీవలి సినిమాలు చాలా దారుణమైన ప్రదర్శనను, అలాగే విమర్శలను తెచ్చుకున్నాయి.
ఇక తాజాగా లైగర్ పరాజయం తరువాత, పూరి పరిస్తితి మరింత దిగజారింది. పూరితో సినిమాలు తీయడానికి లేదా ఆయన పై పెట్టుబడి పెట్టడానికి ఏ ఫైనాన్షియర్ కూడా ఆసక్తి చూపడం లేదు. అలాగే హీరోలు కూడా ఆసక్తి చూపడం లేదు. కెరీర్ లో మొట్ట మొదటి సారిగా పూరి.. ఒక సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లడానికి చాలా కష్టపడుతున్నారు. ఎన్నడూ చవిచూడని ఈ పరిష్టితి నుండి పూరి తిరిగి పుంజుకుంటారో లేదో వేచి చూడాలి. తాజాగా విజయ్ దేవరకొండతో మొదలు అవ్వాల్సిన జనగణమన సినిమా కూడా ఓటివకే రద్దు కాబడిన సంగతి తెలిసిందే.