పోకిరి అనే సినిమా మహేష్ బాబు కెరీర్‌లో ఒక మైలురాయిగా మిగిలిపోయిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తరువాత ఆరు సంవత్సరాలకు మహేష్ – పూరి కాంబినేషన్లో వచ్చిన బిజినెస్‌మెన్ కూడా మహేష్ కెరీర్ లో అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.అయితే ఈ రెండు చిత్రాల తరువాత మహేష్ బాబు – పూరి జగన్నాథ్ మళ్ళీ కలిసి ఏ సినిమాకీ పని చేయలేదు. జన గణ మన అనే సినిమా ఇద్దరి కలయికలో వస్తుందని చాలా సార్లు పుకార్లు షికార్లు చేసినా అవేవీ కార్య రూపం దాల్చలేదు.
ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పోకిరి మరియు బిజినెస్ మాన్ చిత్రాల సీక్వెల్స్ ఆలోచన గురించి పూరి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.బిజినెస్ మ్యాన్ సినిమాను ఫ్రాంచైజీగా తెరకెక్కించే ఐడియా తనకు ఉందని, ఆ వెసులుబాటు ఉందని పూరీ జగన్నాథ్ అన్నారు. అంతే కాకుండా సూర్య భాయ్ క్యారెక్టర్‌తో ఇంకా చేయించాల్సినవి చాలా ఉన్నాయని కూడా అన్నారు. పోకిరి సినిమాకు కూడా సీక్వెల్ వచ్చే అవకాశం ఎంతైనా ఉందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
పూరి జగన్నాథ్ నిజానికి ఈ రెండు సినిమాల సీక్వెల్ తాలూకు ఆలోచన ఇప్పుడేదో కొత్తగా వచ్చింది కాదని, 2010 సమయంలోనే తనకు ఈ ఆలోచన వచ్చిందని, కానీ మహేష్ ఆ సమయంలో ఇతర సినిమాలతో చాలా బిజీగా ఉండటం వల్ల ఆ ఆలోచనలకు మహేష్ తో చర్చించే అవకాశం రాలేదని అందుకే ఆ రెండు చిత్రాల సీక్వెల్ లు తెరకెక్కించలేదని పూరి తెలిపారు.
పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ అవగా, బిజినెస్ మాన్ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మరి అంతటి భారీ ఘన విజయం సాధించిన సినిమాలకు ఒకవేళ నిజంగా సీక్వెల్స్ వస్తే అవి ఏ స్థాయిలో ఉంటాయో అనేది ఊహకి కూడా అందని విషయం.
అయితే బిజినెస్‌మెన్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ తన విజయ పరంపరను కొనసాగించలేకపోయారు. వరుస ఫ్లాపులతో తన స్థాయికి తగ్గ సినిమాలను రూపొందించలేకపోయారు.
ఆ తరువాత ఆయన చేసిన సినిమాల్లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన టెంపర్ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. అవినీతి పరుడైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎన్టీఆర్ నటన విశేష స్పందనను తెచ్చుకుంది. అయితే టెంపర్ తరువాత మళ్ళీ కొన్ని ప్రేక్షకుల పై ఏమాత్రం ప్రభావం చూపని సినిమాలు తీసిన తరువాత ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. ఇక ఆ చిత్రం తరువాత రౌడి స్టార్ విజయ్ దేవరకొండతో తాజాగా లైగర్ సినిమాను చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో, పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ విడుదలకు మరొక్క రోజే ఉంది. ఈ సినిమాపై దర్శకుడు పూరితో పాటు హీరో విజయ్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి వారి అంచనాలకు తగ్గట్టు సినిమా రాణిస్తుందా లేదా అన్నది చూడాలి.