తెలుగు సినీ కార్మికులు చేస్తున్న సమ్మెపై నిర్మాతలు స్పందించారు. వేతనాలు పెంచడానికి తమలో ఎలాంటి అభ్యంతరం లేదంటూనే, కొన్ని షరతులు కూడా పెట్టారు. రేపటి నుంచి యధావిధిగా షూటింగ్ కు వస్తే, ఎల్లుండి నుంచి వేతనాలకు సంబంధించిన చర్చలు జరుపుతామని ప్రకటించారు. అలా జరగకపోతే వారు కూడా షూటింగ్ లు నిలిపి వేస్తామని హెచ్చరించారు.
వేతనాలు పెంచాలనే డిమాండ్ల తో షూటింగ్ల కు రావొద్దని నిర్మాతలు స్పష్టం చేశారు. ఎలాంటి షరతులు లేకుండా షూటింగ్ కు వస్తే జీతాలపై చర్చిస్తామని చెప్పారు. ఈ ఒక్క రోజు షూటింగ్లు ఆగిపోవడం వలన నిర్మాతలకు రెండు కోట్ల రూపాయల నష్టం వచ్చిందని, ఇకనైనా బెట్టు చేయకుండా షూటింగ్ కు వస్తే మంచిదని చెప్పారు.
రేపటి తో కార్మికులు షూటింగ్ కు రాకపోతే కార్మికుల బండారం మొత్తం బయటపెడతాం అన్నట్లుగా హెచ్చరికనూ జారీ చేశారు నిర్మాతలు. పని చేయకుండా వేరే చోటి నుంచికార్మికులను తీసుకువచ్చి, వాళ్లకు కూడా నిర్మాతలతో డబ్బులు ఇప్పించుకున్న సంఘటనలు కూడా ఉన్నాయని, అలాంటివి మళ్ళీ జరగకుండా చూడాలని నిర్మాతలు అన్నారు.బయట రోజూ ఇచ్చే వేతనాలతో పోలిస్తే, సినీ కార్మికులకు 150 శాతం అదనంగా వేతనాలు ఇస్తున్నామని తెలిపిన నిర్మాతలు,రెండు పూటలా తిండి పెట్టి వేతనం ఇస్తున్న రంగం వేరేఏదైనా ఉందా అని ప్రశ్నించారు.వేతనాల పెంపుకు సంబంధించి కనీసం రెండు మూడు నెలలైనా చర్చలు జరుగుతాయని, హఠాత్తుగా నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని తెలిపారు.
అసలు సమ్మె చేస్తున్నామంటూ సరైన నోటీసు లేకుండా కేవలం లేఖ ఇచ్చి హటాత్తుగా చేసినట్టు నిర్మాతలు కార్మికులపై ఆరోపణలు చేశారు.ఎక్కువ వేతనాలకు ఇచ్చే నిర్మాతలకు మాత్రమే సినిమాలు చేస్తామని కార్మిక సంఘాలు అనుకుంటే తాము పక్క రాష్ట్రాల నుంచి సినీ కార్మికులని తెచ్చుకొని పని చేయించుకోవడానికిఏమాత్రం వెనకాడమని నిర్మాతలు తెలిపారు.ఎందుకంటే ఎవరైనా ఎక్కడైనాపని చేయచ్చు, పని చేయుంచుకోవచ్చు అనే నిబంధన కూడా ఉన్నట్టుగా ఈ సందర్భంగా ప్రస్తావించారు.