పండగ సీజన్ కోసం సినిమా ప్రేమికులు మరియు ప్రేక్షకులు సాధారణంగా థియేటర్లలోకి పెద్ద సంఖ్యలో వస్తారు. అందుకే ఒక సినిమా విడుదలకు సంక్రాంతి సీజన్ అనేది ఉత్తమ సమయంగా భావిస్తుంటారు. ప్రతి సినిమా సంక్రాంతి రేసులోకి రావాలని, ఆ స్థానం కోసం పోటీ ఉంటుంది.
రాబోయే సంక్రాంతికి ప్రభాస్ ఆదిపురుష్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య మరియు బాలకృష్ణ యొక్క వీరసింహా రెడ్డి సినిమాలు ఢీకొంటాయని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ పందెంలోకి కొత్త ఆటగాడు ప్రవేశించినట్లు కనిపిస్తోంది.
అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ పెద్దగా సందడి చేయకుండా మెల్లగా సంక్రాంతి రేసులోకి ప్రవేశించారు. సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు ఏజెంట్ టీమ్. అయితే ఇలా అందరూ తమ సినిమాలని సంక్రాంతికి విడుదల చేస్తున్నామని చెప్తూ ఒక రకంగా ఆదిపురుష్ నిర్మాతలను బలవంతంగా సినిమాను వాయిదా వేసేలా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
అందుకే ఆది పురుష్ సినిమా సంక్రాంతికి విడుదల కాని పక్షంలో.. తమ సినిమా విడుదలకు ఇదే సరైన సమయం అని ఏజెంట్ చిత్ర బృందం భావిస్తున్నారని అంటున్నారు. వాల్తేరు వీరయ్య మరియు వీరసింహారెడ్డి కంటే ఏజెంట్ సినిమా చాలా క్రేజీ ప్రాజెక్ట్ అని నిర్మాతలు బలంగా నమ్ముతున్నారు. ఈ సంక్రాంతికి ఆదిపురుష్ రిలీజ్ కాకపోతే ఆ స్థానంలో ఏజెంట్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
నిర్మాతల ఆత్మవిశ్వాసం చూస్తుంటే, ఏజెంట్ సినిమా బాగా వచ్చినట్లు కనిపిస్తోంది. కాగా ఏజెంట్ చిత్రం ప్యాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
మరి సంక్రాంతికి ఏ సినిమా నిలదొక్కుకుంటుందో, ఏ సినిమా పోటీకి తట్టుకోలేక కుదేలవుతుందో వేచి చూడాల్సిందే. అన్ని సినిమాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుందని ఆశిద్దాం.