నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం దసరా సినిమా మార్చి 30న హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. గోదావరిఖని బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ లో పల్లెటూరి డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కోసం నిర్మాతలు చాలా కొత్తగా ప్రయత్నం చేస్తున్నారు.
పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ తో తెలుగు సినిమాలు ఒకేసారి పలు భాషల్లో విడుదల కావడం ఇటీవలి కాలంలో మామూలైపోయింది. అయితే ఆయా సినిమాల నిర్మాతలు ఇతర భాషల ప్రమోషన్స్ కోసం పెద్దగా డబ్బులు పెట్టకుండా ప్రమోషన్స్ కోసం కేవలం ఒక ప్రెస్ మీట్ మాత్రం పెట్టేవారు.
నాని ఇటీవల రిలీజ్ చేసిన సినిమాలకు కూడా అదే జరిగింది కానీ దసరాకి మాత్రం నాని ఈసారి విపరీతమైన నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేయమని నిర్మాతల పై ఒత్తిడి తెచ్చారట. ఈ సినిమా అన్ని భాషల్లో వర్కవుట్ అవుతుందనే ప్రగాఢ విశ్వాసాన్ని నాని చూపిస్తుండటంతో ప్రమోషన్స్ కోసం ఖర్చు పెట్టడానికి నిర్మాతలకు కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయటం లేదట. ఎందుకంటే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధిస్తే బాక్సాఫీస్ వద్ద వారికి లాభం కోట్లలో ఉంటుంది.
తాజా సమాచారం ప్రకారం లక్నో మరియు ముంబై వంటి ప్రాంతాల నుంచి మొదలు పెట్టి నార్త్ లో పలు ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తోంది దసరా టీం. అలాగే పొడవాటి జుట్టు, మందపాటి గడ్డంతో నాని ట్రాన్స్ఫర్మేషన్ లుక్ కు నెటిజన్ల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది.
ఇటీవల ఫిబ్రవరి 24న నాని 39వ పుట్టినరోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని 39 థియేటర్లలో నాని బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించింది చిత్ర బృందం. ఆ తర్వాత చెన్నైలో ఓ ఈవెంట్ నిర్వహించి ఆడియో ఆల్బమ్ నుంచి మూడో సింగిల్ ను విడుదల చేయాలని చిత్రబృందం యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన దసరా సినిమా 80వ దశకంలోని తెలంగాణ నేపథ్యంగా సాగుతుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, జరీనా వహాబ్, సాయి కుమార్, షైన్ టామ్ చాకో, రాజశేఖర్ అనింగి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.