ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ చాప్టర్ 2 విడుదలై ఈరోజుకి సరిగ్గా ఏడాది అవుతోంది. అప్పటి నుంచి ఈ సినిమా మూడో భాగం గురించి పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా క్లైమాక్స్ చూస్తే రాకీ భాయ్ తన దగ్గర ఉన్న బంగారాన్ని సముద్రం లోతుల్లోకి తీసుకెళ్తానని తన తల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు.
క్లైమాక్స్ చూసి ప్రేక్షకులు అవాక్కయి థియేటర్లలో ఆ సన్నివేశానికి అదిరిపోయే స్పందన ఇచ్చారు. ఇక కేజీఎఫ్ చాప్టర్ 2 చివర్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రేక్షకులకు ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. మూడో భాగం గురించి పోస్ట్ క్రెడిట్ సన్నివేశంలో సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏడాది తర్వాత కేజీఎఫ్ మూడో భాగం పట్టాలెక్కే అవకాశం ఉందని నిర్మాతలు హోంబలే ఫిలిమ్స్ సంకేతాలిచ్చారు.
కేజీఎఫ్: చాప్టర్ 2 ఏడాది వార్షికోత్సవం సందర్భంగా బ్యానర్ ఒక ట్రిబ్యూట్ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది మరియు మూడవ చిత్రం 1978 మరియు 1981 మధ్య రాకీకి ఏమి జరిగిందనే కథను చెబుతుందని సూచిస్తుంది, ఈ కథను రెండవ భాగంలో వెల్లడించలేదు. అంతే కాకుండా, మూడవ సినిమా గురించి వారి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటామని ధృవీకరిస్తూనే, ఇప్పటి వరకూ చూడని ఒక ఘర్షణ చూడబోతున్నారు అని ఒక నిగూఢ సందేశం కూడా ఈ వీడియో సూచిస్తుంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన వెర్షన్ కథలు రాయడం మొదలుపెట్టారు. కేజీఎఫ్ మూడో అధ్యాయాన్ని ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలిసి పని చేస్తున్న సాలార్ సినిమాతో లింక్ చేసి ఉండొచ్చని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.
‘కేజీఎఫ్’కు సీక్వెల్ గా ‘కేజీఎఫ్ 2’ తెరకెక్కింది. ఈ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ లో యశ్ హీరోగా నటించగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించారు. బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. అర్చన జాయిస్ – ప్రకాష్ రాజ్ – రావు రమేష్ – ఈశ్వరీ రావు తదితరులు సహాయక పాత్రల్లో కనిపించారు.
హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందించారు. ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ వర్క్ చేశారు. ‘కేజీఎఫ్ 2’ను తెలుగులో వారాహి చలన చిత్ర సంస్థ విడుదల చేసింది.