తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర నిర్మాతగా దిల్ రాజుకు ఎలాంటి స్టేటస్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక డిస్ట్రిబ్యూటర్ మరియు ఎగ్జిబిటర్ గా ఆయన కష్టపడి నేడు ఈ స్థాయిలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. నిఖిల్ నటించిన తాజా చిత్రం ‘కార్తికేయ 2’ రిలీజ్ పలు మార్లు వాయిదా పడి చివరాఖరికి ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
అయితే విడుదలకు ముందు ఎన్ని వివాదాలు, సమస్యలు చుట్టుముట్టినా.. శనివారం విడుదలైన కార్తీకేయ 2 సినిమా ప్రేక్షకులను విశేష స్థాయిలో అలరిస్తూ అద్భుతమైన స్పందనతో పాటు కలెక్షన్లు కొల్లగొడుతూ నిఖిల్ కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇంకా మూడు రోజుల రన్ మాత్రమే పూర్తి చేసుకున్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో కూడా చక్కని హిట్ దిశగా పయనిస్తుంది.
ఈ క్రమంలో కార్తీకేయ 2 చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఆ ఫంక్షన్ కు దిల్ రాజు కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కార్తీకేయ 2 రిలీజ్ వాయిదాల వెనక తన ప్రమేయం వుందంటూ వచ్చిన వార్తల పై తాజాగా దిల్ రాజు స్పందించారు.
మీడియా వాళ్ళు వాస్తవాలు తెలుసుకుని రాయాలని, అది చేత కానప్పుడు మూసుకుని కూర్చోవాలి అని ఆయన చాలా ఘాటుగా స్పందించారు. ‘కార్తికేయ 2’ సక్సెస్ మీట్ లో అతిథిగా పాల్గొన్న దిల్ రాజు తనపై వచ్చిన ఆరోపణలపై మీడియాని లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతూ మండిపడ్డారు.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ మీడియా వారు అడిగితే అసలు నిజం ఎంటో తెలుసుకునేందుకు తాను సమయం ఇస్తానని.. ఆ తరువాతే వాస్తవాలు రాయండి కానీ కేవలం మీ వ్యూస్ లేదా క్లిక్కులు, సబ్స్ క్రైబర్స్ కోసం ఇతరుల పేరును పాడు చేయవద్దని అన్నారు.
సాధారణంగా తాను ఎవరితోనూ గొడవలు పెట్టుకునే మనిషిని కానని దిల్ రాజు చెప్పారు. అయితే ‘కార్తికేయ2’ సినిమాని తానే కావాలని టార్గెట్ చేశానన్న వదంతి తనని తీవ్రంగా బాధ పెట్టిందని వాపోయారు. అంతే కాకుండా ఈ విషయంలో మీడియా తనని ఒక బలిపశువుతో సమానంగా చూసి ప్రవర్తించిందని ఆయన బాధ పడ్డారు.
ఒక పక్క ఐదు సినిమాలు ఆడుతున్నా కార్తికేయ 2 సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు నమోదు చేసిందని దిల్ రాజు చెప్పారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పరిశ్రమలోనే అగ్ర నిర్మాణ సంస్థ అని.. అలాంటిది వారిని ఎవరైనా ఎలా ఇబ్బంది పెట్టగలరు అని ప్రశ్నిస్తూ.. ఇలాంటి అవాస్తవాలు రాయకుండా.. మీడియా వారు ఫలానా వార్తను ప్రచురించే ముందు కాస్తైనా ఇంగిత జ్ఞానంతో ఆలోచించాలని దిల్ రాజు సూచించారు.
అలాగే కార్తీకేయ 2 నిర్మాత అయిన అభిషేక్ అగర్వాల్ తనకి మంచి మిత్రుడని.. తనను ఆయన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు కూడా పిలిచారని దిల్ రాజు తెలిపారు. అలాగే హీరో నిఖిల్ కూడా తనకు చాలా సన్నిహితుడని చెప్తూ.. సినిమాను వాయిదా వేసే విషయంలో అందరినీ సంప్రదించిన తరువాతే నిర్ణయం తీసుకున్నారు తప్ప అసలు మొత్తం వ్యవహారంలో తను ఎవ్వరినీ బలవంతం చేయలేదు అని దిల్ రాజు వివరణ ఇచ్చారు.