యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకునే జంటగా నటిస్తున్న సినిమా ‘ప్రాజెక్ట్ కె’. ‘మహానటి’ తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సినిమా ఇదే. పైగా సైన్స్ ఫిక్షన్ కథతో రూపొందుతున్న ఈ సినిమా అత్యధిక బడ్జెట్ తో భారీ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి నిర్మాత తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాతల్లో ఒకరైన సి అశ్వనీ దత్ గారు.
ఆయన తన రెండో బ్యానర్ అయిన స్వప్న సినిమా బ్యానర్ పై దుల్కర్ సల్మాన్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా ‘సీతా రామం’ సినిమాను నిర్మిస్తున్నారు.ఆ చిత్రం ఈ నెల ఆగస్టు 5న విడుదల కానుంది. ఆ చిత్ర ప్రచార కార్యక్రమాలలో భాగంగా మీడియాతో మాట్లాడిన నిర్మాత అశ్వినీదత్… ‘ప్రాజెక్ట్ కె’ విడుదల ఎప్పుడో చెప్పారు.
ఈ మేరకు వచ్చే ఏడాది జనవరిలో ‘ప్రాజెక్ట్ కె’ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి అవుతుందని సి. అశ్వినీదత్ చెప్పారు. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కొంత సమయం పడుతుందని… ఆ పనులన్నీ పూర్తి చేసుకుని అక్టోబర్ 18, 2023న సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఒకవేళ ఇతర కారణాల వల్ల ఆ తేదీకి సినిమాని విడుదల చేయలేక పోతే 2024 సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకుంటున్నట్లు నిర్మాత అశ్వినీదత్ తెలిపారు.
ప్రాజెక్ట్ కే చిత్రంలో బాలీవుడ్ షేహెన్షా అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆయన పాత్ర అత్యంత శక్తివంతంగా ఉండబోతుందని అశ్వినీదత్ తెలిపారు. అలాగే బాలీవుడ్ హాటెస్ట్ బ్యూటీ హీరోయిన్ దిశా పటానీ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు.
‘ప్రాజెక్ట్ కె’ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు తెరపై రానటువంటి సరికొత్త కథాంశంతో ‘ప్రాజెక్ట్ కె’ తెరకెక్కుతోందని సమాచారం.