ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ ఒక రకమైన కష్టకాలాన్ని ఎదుర్కుంటోంది. కరోనా పాండమిక్ వచ్చిన తర్వాత పరిశ్రమ విధి నిర్వహణలో, ప్రేక్షకులలో వచ్చిన మార్పులను ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు చూసి ఆనందిస్తారు అనే విజయ రహస్యాన్ని ఎవరూ పట్టుకోలేకపోతున్నారు. ఇక కరోనా వల్ల ఏర్పడ్డ నష్టాలను పూడ్చడానికి టికెట్ రేట్లు పెంచుకోడానికి అనుమతి తెచ్చుకుంటే.. ఆ ప్రయత్నం తీవ్రంగా బెడిసి కొట్టి ప్రేక్షకులు సినిమాలు చూడటానికి థియేటర్లకు రావడమే తగ్గించేశారు. దీంతో హిట్ టాక్ వచ్చిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవుతున్నాయి.
ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలపై చర్చించిన నిర్మాతల గిల్డ్ .. ఆగస్ట్ 1వ తేదీ నుంచి షూటింగ్లను ఆపి వేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇదే విషయం పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సినిమాలు అంటేనే ప్రేక్షకుల్లో విరక్తి భావం కలిగిందని.. అందుకనే వాళ్ళు థియేటర్ కు రావడం తగ్గిందని ఆయన అన్నారు. నిర్మాతలు లేదా పంపిణీదారులు కాకుండా హీరోలు సీఎంల వద్దకు వెళ్లి టికెట్ ధరలు పెంచుకోవడమే ప్రస్తుత స్థితికి కారణమని అభిప్రాయపడ్డారు.
అలాగే ముందు సినిమా టికెట్ రేట్లు పెంచమని అడిగిన వాళ్లే.. ఇప్పుడు తగ్గించమని అడుగుతున్నారని, మళ్ళీ వాళ్లే ఇప్పుడు షూటింగ్ లను బంద్ చేస్తామంటున్నారు. నిర్మాతల సమస్యల పరిష్కారానికి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏర్పాటైందని.. అయితే ప్రస్తుతం ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఎందుకు ఏర్పాటైందో అర్థం కావడం లేదన్నారు. హీరోలు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడం వల్లే.. సినిమా టికెట్ రేట్లు పెంచారనేది కేవలం సాకు తప్ప మరేమీ కాదని ఆయన అన్నారు.అశ్వినీదత్ చేసిన వ్యాఖ్యలను నిర్మాత బండ్ల గణేష్ సమర్ధించారు.
ఇటివలే నిర్మాత బండ్ల గణేష్ ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో దీని పై స్పందించారు. అశ్వినీదత్ వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు ఆయన చెప్పారు. అసలు పరిశ్రమలో ఏ హీరోను లేదా డైరెక్టర్ ను రెమ్యునరేషన్ తగ్గించుకోమని అడిగే అర్హత ఏ నిర్మాతకీ లేదని అన్నారు.
ఒక్కో హీరోకు ఒక్కో రేటు ఉంటుంది. వారి స్థాయిని బట్టి వారికున్న వాళ్లకు మార్కెట్ బట్టి సినిమాలు తీయాలి కానీ.. హీరోలు – డైరెక్టర్లు రెమ్యునరేషన్ తగ్గించాలనే వాదన ఏమాత్రం సబబు కాదు అని బండ్ల గణేష్ పేర్కొన్నారు.ప్రొడ్యూసర్స్ గిల్డ్ అనే గ్రూపు అసలు అనసరం లేదని, నిర్మాతల సమస్యలను తీర్చడానికి కౌన్సిల్ ఉందని, అసలు ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న నిర్ణయాలు అన్నీ అర్థం పర్థం లేనివని బండ్ల గణేష్ అన్నారు.
హీరోలు లేదా దర్శకుల పారితోషికాలు తగ్గించడం కాకుండా సరైన సినిమా తీసి దానిని అనుకున్నది అనుకున్నట్లు తెరకెక్కించాలని, అప్పుడే సినిమాలు విజయాలు సాధిస్తాయి అని బండ్ల గణేష్ అభిప్రాయపడ్డారు.