యంగ్ రెబల్ స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా సాలార్. ఈ సినిమా కంటే ముందే ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ అనే సినిమా విడుదల కానుంది. సంక్రాంతికి రాబోయే ఆ సినిమా పై కూడా ప్రేక్షకులలో భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నప్పటికీ.. అందరి దృష్టి అయితే ఎక్కువగా సాలార్ సినిమా పైనే ఉందని చెప్పాలి.
ఎందుకంటే ఆ సినిమాకి దర్శకుడు ప్రశాంత్ నీల్ కావడమే. కేజీఎఫ్ సీరీస్ వంటి మాస్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్న సినిమాలు తీసిన ప్రశాంత్ నీల్.. ప్రభాస్ లాంటి మాస్ హీరోను ఇంకెంత స్థాయిలో చూపిస్తాడో.. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఇంకెంత అద్భుతంగా ఉంటాయో అని వేయి ఆశలతో ఉన్నారు. అయితే ప్రభాస్ నటించిన చివరి రెండు సినిమాలైన సాహో, రాధే శ్యామ్ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాధే శ్యామ్ సినిమా అయితే భారీ స్థాయిలో డిజాస్టర్ అయింది.
అందువల్ల ప్రభాస్ అభిమానులు తమ ఆశలన్నీ సాలార్ పైనే పెట్టుకున్నారు. ప్రశాంత్ నీల్ ఖచ్చితంగా తమ హీరోకి బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తాడు అనే నమ్మకంతో ఉన్నారు. అయితే ఈ సినిమా చివర్లో ప్రేక్షకుల ఊహకు అందని ట్విస్ట్ ఉండబోతుందట. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన కమల్ హాసన్ ‘ విక్రమ్ ‘ తరహాలోనే సాలార్ లో కూడా ముగింపు దశలో ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.
కమల్ హాసన్ విక్రమ్ సినిమాలో చివరి పది నిమిషాల్లో సూర్య నటించిన రోలెక్స్ పాత్ర ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విక్రమ్ సినిమాకి ఆ పాత్ర మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచింది. ఆ సన్నివేశం థియేటర్ లో వచ్చినపుడు ప్రేక్షకుల స్పందన అంతా ఇంతా కాదు.
అయితే సాలార్ సినిమాలో కూడా అదే తరహాలో క్లైమాక్స్ లో అందరినీ ఆశ్చర్య పరిచే ట్విస్ట్ ఉంటుందని సమాచారం. ఆ పాత్ర ఒక స్టార్ హీరో చేస్తాడని వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఇదివరకు సాలార్ సినిమాకి సంబందించిన పుకార్లలో కేజిఎఫ్ నుంచి రాకీ భాయ్ ఆ చిత్రంలో కనిపిస్తారు అని గట్టిగా వినిపించినా.. వాటి పై అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు.
మరి ఇప్పుడు ఈ పాత్రను యాష్ చేస్తాడో లేక మరో స్టార్ హీరో చేస్తాడో చూడాలి. . ఇక సాలార్ సినిమాని ఇదివరకు 2023 వేసవిలో విడుదల చేద్దామనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నా.. షూటింగ్ అనుకున్నంత త్వరగా అవకపోవడం వంటి కొన్ని కారణాల వలన దసరా కానుకగా విడుదల చేయాలని నిర్ణయించారు అని తెలుస్తోంది. ఈ విషయం పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.