ప్రస్తుతం వరుసగా సినిమాలతో కెరీర్ పరంగా బిజీ బిజీగా కొనసాగుతున్నారు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్. ఇక ఆయన చేస్తున్న ప్రస్తుత సినిమాల అనంతరం తాజాగా హనుమాన్ మూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మతో బ్రహ్మ రాక్షస అనే మూవీ చేసేందుకు సిద్ధమయ్యారు ప్రభాస్. అయితే ఈ టైటిల్ ప్రస్తుతం పరిశీలనలో ఉంది. ఈ మూవీలో ప్రభాస్ ని ఒక సరికొత్త లుక్ లో చూపించేందుకు సిద్ధమయ్యారు ప్రశాంత్ వర్మ.
ఇది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) లో భాగంగా రూపొందుతోంది. ప్రభాస్ కి ఈ స్క్రిప్ట్ బాగా నచ్చటంతో నిన్న దీనికి సంబంధించి ఒక లుక్ టెస్ట్ ని ఫోటోలు మరియు వీడియోలతో సహా నిర్వహించారు. ఇందులో ప్రభాస్ తన పాత్రలో అద్భుతంగా ఆకట్టుకున్నారట. అయితే ప్రభాస్ తన డేట్స్ ఖరారు చేసిన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది.
ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ వారు ఈ సినిమాను నిర్మించనుండగా స్క్రిప్ట్ వర్క్ మరియు ప్రీ-విజువలైజేషన్ ప్రస్తుతం జరుగుతోంది. ప్రశాంత్ వర్మ ఇటీవల బ్లాక్ బస్టర్ హనుమాన్ గత సంక్రాంతికి విడుదలైనప్పటికీ, అతను ఇంకా కొత్త సినిమా షూటింగ్స్ ప్రారంభించలేదు. అయినప్పటికీ, మోక్షజ్ఞ తొలి చిత్రం, మహాకాళి మరియు జై హనుమాన్ వంటి మూడు ప్రాజెక్టుల స్క్రిప్ట్స్ మరియు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు.
దీనిని బట్టి ప్రభాస్ తో ఆయన చేయనున్న మూవీ సెట్స్ మీదకు వెళ్ళడానికి చాలానే సమయం అయితే పట్టేలా కనపడుతోంది. మరోవైపు ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్, హను రాఘవపూడి మూవీతో పాటు స్పిరిట్ వరుసగా ఒక్కొక్కటిగా ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.